https://oktelugu.com/

Tomatoes on Subsidy : మండే ధరల వేళ ఏపీ సర్కార్ గొప్ప ఆఫర్.. త్వరపడండి

టమాటా ఉత్పత్తులు సాధారణస్థితికి వచ్చే వరకూ సబ్సిడీపై అందించేందుకు ఏపీ సర్కారు నిర్ణయించడం ఉపశమనం కలిగించే విషయం.

Written By:
  • Dharma
  • , Updated On : June 29, 2023 / 11:43 AM IST
    Follow us on

    Tomatoes on Subsidy : అమాంతం పెరిగిన టమాట ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ధర ఎగబాకడంతో టమాటా అంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాటి కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం కిలో టమాటా రూ.100లకు పరుగులుతీస్తుండడంతో ఏపీ ప్రభుత్వం ఉపశమన చర్యలకు దిగింది. సబ్సిడీపై అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు మార్కెటింగ్ శాఖను రంగంలోకి దించింది.

    ఇప్పటికే కర్నూలు, కడప జిల్లాల్లో నగరాలు, పట్టణాల్లో మార్కెటింగ్ శాఖ కౌంటర్లు ఏర్పాటుచేసి రాయితీపై రూ.50లకే కిలో టమాటా అందించారు. గురువారం నుంచి రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో సైతం అందించేందుకు సిద్ధపడుతున్నారు. రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేయనున్నారు. రైతుల నుంచి టమాటాను సేకరించి రాయితీపై అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులే టమాటా ధర పెరుగుదలకు కారణం. దక్షిణాధి రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు, ఉత్తరాధి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కూడా ధర పెరుగుదలకు ఒక కారణం.

    ప్రస్తుతం టమాటా ధర రూ.80 నుంచి రూ.100 పలుకుతోంది. పచ్చిమిర్చి కిలో ధర గురువారం నాటికి రూ.120గా ఉంది. దక్షిణ భారతదేశానికి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో సకాలంలో వర్షాలు పడలేదు. ఇది పంటపై ప్రతికూలత చూపింది. అధిక ఉష్ణోగ్రతలతో పంట ఆశాజనకంగా లేదు. టమాటా మార్కెట్ కు అంతర్జాతీయ స్థాయిలో మదనపల్లె పెట్టింది పేరు. కానీ ప్రతిరోజూ మార్కెట్ కు అరకొరగానే టమాటాలు వస్తున్నాయి.వ్యాపారుల మధ్య విపరీతమైన పోటీ పెరుగుతోంది.

    రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో టమాటా ఉత్పత్తుతు తగ్గుముఖం పట్టాయి.అటు ఉత్తరాధి రాష్ట్రాల నుంచి రావాల్సిన పంట కూడా నిలిచిపోయింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పంట పూర్తిగా నాశనమైంది. మిగతా పంట విక్రయించేందుకు అవకాశం ఉన్నా రవాణా వ్యవస్థ స్థంభించడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయింది. టమాటా ఉత్పత్తులు సాధారణస్థితికి వచ్చే వరకూ సబ్సిడీపై అందించేందుకు ఏపీ సర్కారు నిర్ణయించడం ఉపశమనం కలిగించే విషయం.