AP Jobs 2026: ఏపీలో( Andhra Pradesh) ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దాదాపు 20 నోటిఫికేషన్ లతో 99 వేల ఉద్యోగాల భర్తీకి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించాలని ఇప్పటికే ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రస్తుతం అధికారులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.. ఆ ప్రక్రియను పూర్తి చేసి ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్నది ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ఏపీ ప్రభుత్వం అధికార ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
* పెద్ద ఎత్తున ఉద్యోగాలు..
అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్( job calendar) ప్రకటిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ జరిగింది. కానిస్టేబుల్ నియామక ప్రక్రియ కూడా పూర్తి చేశారు. తాజాగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలను కూడా విడుదల చేశారు. వచ్చే నెలలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ను ప్రకటించే విధంగా ఖాళీలను గుర్తించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలపై వివరాలను సేకరిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఒక్క ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీలు కాదు.. కాంట్రాక్టు ఉద్యోగుల లెక్కలను కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. ఏపీపీఎస్సీ ద్వారా 20 నోటిఫికేషన్లు విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకు 150 విభాగాలలో ఖాళీ పోస్టుల వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. 99 వేల ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ ఉండొచ్చని వార్తలు వస్తున్నప్పటికీ.. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు.
* ఎన్నికల హామీగా..
2019 ఎన్నికల్లో ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy)హామీ ఇచ్చారు. కానీ అమలు చేయలేకపోయారు. టిడిపి కూటమి సైతం ఇదే హామీ ఇచ్చింది. కానీ గత ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. అందుకే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ద్వారా నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటివరకు అధికారులు గుర్తించిన ఖాళీల ప్రాప్తికి.. పట్టణాభివృద్ధి శాఖలో 27 వేలు, పంచాయితీరాజ్ శాఖలో 26 వేలు, రెవెన్యూ శాఖలో 13 వేలు, ఉన్నత విద్యా శాఖలో 7 వేలు ఖాళీల భర్తీ చేపట్టవోచ్చని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్కు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఇంకోవైపు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఉద్యోగాల భర్తీపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం.