Site icon OkTelugu

AP Pensions: పదవీ విరమణ.. పెన్షన్ల పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

AP Pensions

AP Pensions

AP Pensions: ఏపీ ప్రభుత్వం( AP government) కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసింది. ఉద్యోగుల పదవీ విరమణ, పెన్షన్ పై కొత్త మార్గదర్శకాలు సిద్ధం చేసింది. అందుకు సంబంధించి ముసాయిదా విడుదల చేసింది. దీనిపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను సైతం కోరింది. ఉద్యోగి 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తే ప్రభుత్వానికి పదవీ విరమణ చేయించే విధంగా అధికారం కల్పించే ప్రతిపాదన తీసుకొచ్చింది. ముందుగా నోటీసు, లేదంటే జీతభత్యాలు ఇచ్చి వారితో పదవీ విరమణ చేయించేలా నిబంధనలు సిద్ధం చేయడం విశేషం. అయితే తుదిగా ఉద్యోగ సంఘాల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని.. తుది ఉత్తర్వులు జారీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

* ప్రజా ప్రయోజనాల దృష్ట్యా..
తాజా మార్గదర్శకాల మేరకు 33 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగి.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పదవీ విరమణ చేయించేలా సరికొత్త విధానాన్ని ప్రభుత్వం ముసాయిదాలో పేర్కొంది. సాధారణంగా పదవీ విరమణ వయస్సు రాకపోయినా.. 33 ఏళ్ల సర్వీస్ కాలం పూర్తి చేస్తే.. పదవీ విరమణ చేయించేలా నూతన సివిల్ ఏపీ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు- 2026 ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. 33 సంవత్సరాల పాటు సర్వీస్ పూర్తి చేసుకోవడం ద్వారా.. ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత పూర్తిస్థాయిలో పెన్షన్ ప్రయోజనాలు అందుతాయి. ఒకవేళ ఉద్యోగి 33 ఏళ్ల సర్వీసుకు దగ్గరలో ఉంటే.. వారికి మూడు నెలల ముందు నోటీసులు జారీ చేస్తారు. ఆ మూడు నెలలకు సమానమైన జీతభత్యాలు కూడా అందిస్తారు. దీంతో పాటు ఒక వెసులుబాటు ఇస్తూ ప్రతిపాదనలు చేశారు. పదవీ విరమణ పింఛన్ లో కొంత నగదు మొత్తాన్ని కమ్యూట్ గా మార్చుకోవచ్చు. ముసాయిదాలో పేర్కొన్న ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. ఏకాభిప్రాయంతోనే అడుగులు వేయాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం.

* తెరపైకి కొత్త విధానం..
ప్రస్తుతం ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980( AP revised pension rules 1980) అమల్లో ఉంది. దీని స్థానంలోనే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు 2026 తీసుకురావాలని భావిస్తోంది. ఈ కొత్త ముసాయిదాలు 98 పేజీలలో కొత్త నిబంధనలను వివరించారు. అయితే ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానంలో పదవీ విరమణ గరిష్ట సర్వీసు.. 33 ఏళ్ల తర్వాత చేయించే నిబంధన పై మాత్రం అభ్యంతరాలు ఉన్నాయి. సాధారణంగా ఉద్యోగులు పింఛన్ కోసం కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయాల్సి వస్తుంది.. పైగా చివరి వేతనంలో 50% పింఛన్ గా వస్తుంది. అంటే సర్వీసు తగ్గితే.. చివరి జీతాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం పింఛన్ మొత్తం తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకే దీనిపై అభ్యంతరాలు ఎక్కువగా వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Exit mobile version