Fees Reimbursement : ఏపీ ప్రభుత్వం( AP government ) విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫీజు రియంబర్స్మెంట్( fees reimbursements ) బకాయిలను విడుదల చేసింది. ఇందుకుగాను ప్రభుత్వం రెండు వేరువేరు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి నిధులను విడుదల చేసింది. 2024 -25 విద్యా సంవత్సరానికి సంబంధించి మైనారిటీ విద్యార్థులకు మొత్తం రూ. 40.22 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో ఆ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం స్పందించింది. ఈ నిధుల విడుదలకు సంబంధించి పాలన అనుమతులు కూడా ఇచ్చింది. ఈ మొత్తం రూ.40.22 కోట్లలో.. ముస్లిం మైనారిటీ విద్యార్థుల ఫీజుల చెల్లింపులకు రూ.37.88 కోట్లు, క్రైస్తవ మైనారిటీ విద్యార్థుల కోసం రూ. 2.34 కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎందుకు గాను ప్రభుత్వం రెండు వేరువేరుగా ఉత్తర్వులు జారీచేసింది.
* వారి వినతితోనే
రాష్ట్రంలో రాయలసీమలో( Rayalaseema) ఎక్కువగా ముస్లిం మైనారిటీలు ఉన్నారు. వారి నుంచి వచ్చిన వినతి మేరకు ప్రభుత్వం స్పందించింది. మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల చేయడంపై మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఫరూక్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఈ డబ్బులు ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. నిధులు విడుదల కు కృషిచేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. టిడిపి మరోసారి మైనారిటీల పక్షపాతిగా నిలిచిపోయిందని చెప్పారు.
* క్లస్టర్ పాఠశాలలకు
ఇంకోవైపు రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ పాఠశాలల( cluster schools) సమావేశాలకు సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రవాణా భత్యంతో పాటు నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.28.09 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2809 క్లస్టర్లు ఉంటే.. ఒక్కో దానికి లక్ష రూపాయలు చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధుల్లోంచి నిర్వహణకు రూ.30,000, బోధన, అభ్యసన మెటీరియల్ కు రూ.25000, ఇతర ఖర్చులకు రూ.35000, రవాణా బత్యానికి రూ.10,000 చొప్పున అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
* ఎస్సీ వసతి గృహాలకు
ఎస్సీ వసతి గృహాల( SC hostels ) మరమ్మత్తులతో పాటు నూతన భవనాల ఏర్పాటుకు సంబంధించి పీఎం అజయ్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. రూ. 9.15 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మొత్తాన్ని కేంద్రం గ్రాంట్ ఇన్ ఎయిట్ గా అందించింది. ఈ నిధుల వినియోగించిన అనంతరం కేంద్రానికి యూసీలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ ఎండిని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ పథకంలో భాగంగా వసతి గృహాలకు మరమ్మత్తులు. అదనపు గదులను నిర్మించనున్నారు.