AP Government : ఎస్సీ వర్గీకరణకు ఏపీ ప్రభుత్వం( AP government) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు తర్వాత ఏపీ ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఇచ్చిన నివేదికపై ఈరోజు అసెంబ్లీలో చర్చ జరిగింది. అందులో దళిత వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గీకరణకు తమ మద్దతు ప్రకటించారు. అనంతరం సీఎం చంద్రబాబు ఈ చర్చకు సమాధానం ఇచ్చారు. ఇందులో ఆయన ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసేందుకు తాము నియమించిన ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. దీంతో ఎస్సీ వర్గీకరణకు ఏపీ ప్రభుత్వం అనుకూలమని తేలింది.
* జనాభా గణన తరువాతే
కాగా ఏకసభ్య కమిషన్( single man Commission ) ఇచ్చిన నివేదికలో కొంత అస్పష్టత ఉంది. జనాభా గణన ఇంతవరకు జరగలేదు. అందుకే సంబంధిత చైర్మన్ ఎటువంటి సూచనలు చేయలేదు. 2026 లో జరిగే జనాభా లెక్కల తర్వాత జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేసేలా సిఫారసు మాత్రమే చేశారని చంద్రబాబు వెల్లడించారు సభలో. దానికి ఏకీభవిస్తున్నామని.. జిల్లాల వారీగా విభజనకు మొక్కు చూపుతున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సమస్య ఎప్పటినుంచో ఉందని.. గతంలో టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడే తాము కేంద్రానికి ఈ మేరకు ప్రతిపాదన చేసి పంపిన విషయాన్ని గుర్తు చేశారు చంద్రబాబు. గతంలో మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాన్ని గుర్తించి తాము దీనికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
* మాట నిలబెట్టుకున్న టిడిపి..
ఈ ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణ పై చంద్రబాబు( Chandrababu) స్పష్టమైన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు నాడే చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ మాట నిలబెట్టుకున్నట్లు అయ్యింది. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ ద్వారా ఏ ఏ కులాలకు ఎంత మేర రిజర్వేషన్లు వస్తాయో చంద్రబాబు అసెంబ్లీలో వివరించే ప్రయత్నం చేశారు. అనంతరం ఏపీ అసెంబ్లీ ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ను ఆమోదిస్తూ తీర్మానం చేసింది.