AP Housing Scheme 2025: ఏపీ( Andhra Pradesh) ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాల్లో సొంతిల్లు లేని పేదలకు ఇది శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన- ఎన్టీఆర్ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల 30 వరకు అవకాశం ఉంది. అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3.47 లక్షల మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఒక్కో ఇంటికి రూ. 1.5 లక్షల సాయం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మరో లక్ష రూపాయలు కలిపి.. మొత్తం రూ.2.5 లక్షల సాయం అందనుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో..
పేదలకు సొంతింటి కల సహకారం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కేంద్ర ప్రభుత్వంతో( central government) కలిపి పేదలందరికీ సొంత ఇల్లు అందించేందుకు రెండు రకాలుగా సాయం అందిస్తోంది. సొంత స్థలం ఉన్నవారు అక్కడే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే స్థలం లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలాన్ని కేటాయించి.. అక్కడే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ పథకం కింద అర్హులను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ఆవాస్ ప్లస్ అనే ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలను సేకరించి.. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
నేరుగా సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల వద్దకు వచ్చి ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు. సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, గృహ నిర్మాణ శాఖ ఏఈలు ఇంటింటికి వెళ్లి అర్హులను గుర్తిస్తారు. దరఖాస్తుదారులు ప్రస్తుతం ఉంటున్న ఇంటి ఫోటో.. దాని లొకేషన్ వివరాలను ఆవాస్+ యాప్ లో అప్లోడ్ చేస్తారు. కొత్తగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్న స్థలం ఫోటోను కూడా తీసి యాప్లో నమోదు చేస్తారు. దరఖాస్తుదారు ఫోటోను యాప్ లో అప్లోడ్ చేయగానే.. ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా ఆధార్ కార్డు వివరాలు ఆటోమేటిక్ గా కనిపిస్తాయి. అంతేకాకుండా జాబ్ కార్డు వివరాలను కూడా సేకరిస్తారు. ఈ ప్రక్రియ అంతా పకడ్బందీగా జరిగి.. అర్హులైన పేదలందరికీ ఇల్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
* ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
* అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో దరఖాస్తులు వచ్చాయి.
* విశాఖ జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.
* ఈ యాప్ ద్వారా అత్యంత పేదలకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు ప్రాధాన్యమిస్తూ ఇల్లు మంజూరు చేయనున్నారు.
* రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. అర్హత ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తుంది.