AP Free Bus New Routes: ఏపీలో( Andhra Pradesh) మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించిన పథకం దిగ్విజయంగా అమలవుతోంది. పెద్ద ఎత్తున మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఆదరణ కనిపిస్తోంది. అయితే ఐదు రకాల ఆర్టీసీ బస్సులలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఘాట్ రోడ్లలో ఈ పథకం అమలు చేయలేమని తొలుత ప్రభుత్వం చెప్పింది. ఘాట్ రోడ్లలో సామర్థ్యానికి మించి బస్సులను తిప్పితే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని భావించింది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఘాట్ రోడ్లలో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించలేదు. అయితే దీనిపై విమర్శలు రావడంతో తిరుమల కొండకు ఉచిత బస్సు పథకం అమలు చేయనున్నట్లు ఆర్టిసి ప్రకటించింది. మరోవైపు ఈ పథకం వినియోగం కోసం మహిళలకు ప్రత్యేకంగా కార్డులు కూడా ఇవ్వనుంది. ఉచిత బస్సు ప్రయాణం మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read: ఫ్రీ బస్సు ఎఫెక్ట్ : ఏపీ బస్సుల్లో మహిళల కొట్లాట మొదలైంది.. వీడియో
ఘాట్ రోడ్లలో సిట్టింగ్ వరకు
ఘాట్ రోడ్లతో ( Ghat roads )పాటు దేవస్థానాలకు సంబంధించిన బస్సులలో ఉచిత ప్రయాణ పథకం అమలుపై కొంత సందిగ్ధత ఉండేది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు ఈ పథకం అమలుపై తాజాగా సమీక్షించారు. ఘాట్ రోడ్లలోనూ అమలు దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో తిరుమల కొండపైకి వెళ్లే మహిళా భక్తులకు ఉచిత బస్సు పథకం వర్తిస్తుందని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. ఘాట్ రోడ్ కాబట్టి ప్రయాణికుల భద్రత దృష్ట్యా.. బస్సుల్లో సిట్టింగ్ వరకే అనుమతి ఉంటుందని చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సుల్లో మాత్రం ఉచిత ప్రయాణం ఉండదని తేల్చి చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు స్మార్ట్ కార్డులను అందజేస్తామని కూడా ఆ సంస్థ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఉచిత ప్రయాణం వినియోగించుకునే మహిళలు ఇప్పుడు ప్రధానంగా ఆధార్ కార్డులను చూపిస్తున్నారు. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను కూడా అనుమతించాలని ఏపీఎస్ఆర్టీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది.
Also Read: ఏపీలో ఫ్రీ బస్.. ఆ మహిళ ఏం చేసిందో తెలుసా?
త్వరలో స్మార్ట్ కార్డులు..
ఈ పథకం ద్వారా రోజుకు 25 నుంచి 26 లక్షల మంది మహిళా ప్రయాణికులు వినియోగించుకుంటారని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే పథకం ప్రారంభించిన తర్వాత తొలి 5 రోజుల్లో రోజుకు సగటున 18 లక్షల మంది ప్రయాణించినట్లు నిర్ధారించింది. అయితే విద్యార్థులకు సంబంధించిన ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లేదు. రాష్ట్రవ్యాప్తంగా చాలా డిపోల్లో 100కు 100% మహిళలు ప్రయాణిస్తున్నారు. ఇంకోవైపు మహిళల రద్దీని దృష్టిలో పెట్టుకొని.. ఏపీఎస్ఆర్టీసీ సౌకర్యార్థం 1150 కొత్త బస్సులు రానున్నాయి. అందుకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా. అయితే పర్యావరణ హితం కోసం కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను ఏపీకి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాలకు బస్సులు కేటాయిస్తున్నా.. ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం దృష్ట్యా అదనంగా కేటాయించాలని ఏపీ ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం సైతం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.