https://oktelugu.com/

AP floods : సలసల మసులుతున్న బంగాళాఖాతం.. ఈ నెల మొత్తం అల్పపీడనాలు, వాయుగుండాలే.. ఏపీకి ఎంతటి కష్ట కాలమంటే…

సాధారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు, అల్పపీడన ద్రోణులు ఏర్పడటం సర్వసాధారణం. పైగా అక్టోబర్ - నవంబర్ మధ్యకాలంలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడం పరిపాటే. కానీ ఈసారి బంగాళాఖాతం లో పరిస్థితులు విచిత్రంగా ఉన్నాయి. వాతావరణ నిపుణులకు అంతు పట్టని విధంగా మారుతున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 14, 2024 7:55 pm
    Follow us on

    AP flood : బంగాళాఖాతంలో అక్టోబర్ – నవంబర్ మధ్యకాలంలో తుఫాన్లు ఏర్పడుతుంటాయి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్షాల ముప్పు పొంచి ఉంటుంది. సాధారణంగా ప్రతి ఏడాది అక్టోబర్ నెలలో నైరుతి రుతుపవనాలు నిస్తేజంగా మారతాయి. ఆ తర్వాత ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ ఇస్తాయి. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే కాలంలో సముద్ర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడేందుకు అనుకూలంగా ఉంటాయి. అవిక్రమంగా వాయుగుండాలుగా రూపాంతరం చెందుతాయి. అప్పుడప్పుడు పెను తుఫాన్లుగా మారతాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది తీవ్ర వాయుగుండం గా మారి.. ఆ తర్వాత తుఫాన్ గా రూపాంతరం చెంది అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత పది సంవత్సరాల కాలంలో అక్టోబర్ – డిసెంబర్ మధ్యకాలంలో 11 తుఫాన్లు చోటుచేసుకున్నాయి. అందులో ఆరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తీరం దాటడం విశేషం.

    విస్తారంగా వర్షాలు

    బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారింది. అది నెలకొన్న చెన్నై తీరం వరకు బంగాళాఖాతం ఉపరితల ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అరేబియా సముద్రంలో అల్పపీడనం తీవ్ర రూపు దాల్చింది. ఇది తీవ్రవాయుగుండం గా మారుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అది అక్కడి నుంచి బంగాళాఖాతంలో ఉన్న అల్ప పీడనం వరకు ఆవరించి ఉందని తెలుస్తోంది. గత సెప్టెంబర్ నెలలో ఇదే తీరుగా బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. అదే సమయంలో అరేబియా సముద్రం పై తుఫాన్ ఆవరించి ఉంది.. అప్పుడు రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి..ఫలితంగా ఏపీలోని విజయ వాడలో విపరీతంగా వర్షాలు కురిసాయి. ఈసారి కూడా అదే స్థాయిలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

    గత 10 సంవత్సరాలలో ఇలా..

    2014 సంవత్సరంలో హుద్ హుద్ తుఫాన్ ఏర్పడింది.. ఆ తుఫాన్ వల్ల విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి..ఆ తుఫాన్ విశాఖపట్నంలో తీరం దాటింది.

    2016 లో డిసెంబర్ నెలలో వార్దా తుఫాన్ కాకవికలం సృష్టించింది. తుఫాన్ వల్ల నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలో తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వార్ధా తుఫాను నెల్లూరులో తీరం దాటింది.

    2018 అక్టోబర్ నెలలో తిత్లీ తుఫాన్ ఏర్పడింది.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఈ తుఫాన్ వల్ల నష్టపోయాయి.. శ్రీకాకుళంలో ఈ తుఫాన్ తీరం దాటింది.

    2018 డిసెంబర్లో పెతాయ్ తుఫాన్ ఏర్పడింది. కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్రంగా నష్టపోయాయి.. ఈ తుఫాన్ కాకినాడ సమీపంలో తీరం దాటింది.

    2021 సెప్టెంబర్ నెలలో గులాబ్ తుఫాన్ ఏర్పడింది. కళింగపట్నం వద్ద తీరం దాటింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఈ తుఫాన్ వల్ల నష్టపోయాయి.

    2022 డిసెంబర్ నెలలో మాండౌస్ తుఫాన్ ఏర్పడింది. మహాబలిపురం వద్ద తీరం దాటింది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలో తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

    2023 డిసెంబర్ నెలలో మిచౌంగ్ తుఫాన్ ఏర్పడింది. బాపట్లలో తీరం దాటింది.. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.