AP deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) తన స్టైల్ మార్చారా? గతానికి భిన్నంగా కనిపిస్తున్నారా? హావభావాల్లో మార్పు వచ్చిందా? తను కూడా మంచి పాలనా దక్షుడు అని అనిపించుకోవాలని భావిస్తున్నారా? పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. గత కొద్దిరోజులుగా పవన్ వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ప్రజలతో మమేకం అవుతున్న తీరు.. యంత్రాంగానికి ఇస్తున్న ఆదేశాలు ఆయనలో మార్పునకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. అయితే ఈ ఇద్దరితో సమానంగా మంత్రి నారా లోకేష్ సైతం పాలనపై ప్రభావం చూపుతున్నారు.
* లోకేష్ చొరవ..
ఏపీకి( Andhra Pradesh) భారీ తుఫాను వచ్చింది. విధ్వంసం సృష్టించింది. ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉంటూ ఎప్పటికప్పుడు తుఫాను ముందస్తు చర్యలు.. తుఫాన్ తీరం దాటిన తర్వాత సహాయ చర్యలపై సమీక్షించారు. మూడు జిల్లాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు. పునరావాస కేంద్రాలను సందర్శించారు. మంత్రి నారా లోకేష్ సైతం సచివాలయంలో ఉంటూ సమీక్షలు జరిపారు. వాస్తవానికి సీఎం చంద్రబాబు తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసుకోవాల్సింది హోం మంత్రి వంగలపూడి అనిత. కానీ హోం మంత్రికి మించి నారా లోకేష్ వ్యవహరించారు. అయితే శాఖల పరంగా ఇది తప్పు పట్టలేము కానీ.. అటు తరువాత పవన్ సైతం ఇదే మాదిరిగా వ్యవహరించడం మాత్రం కొంత చర్చకు దారితీస్తోంది.
* గతానికి భిన్నంగా..
ఏపీలో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతోంది. ఇప్పటివరకు రకరకాల విపత్తులకు సంబంధించి 15 ఘటనలు జరిగాయి. కానీ ఎన్నడూ పవన్ కళ్యాణ్ బయటకు రాలేదు. బుడమేరు వాగు పొంగి ప్రవహించి విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ప్రాణ నష్టం కూడా సంభవించింది. గోదావరి తో పాటు కృష్ణా నదులు పొంగి ప్రవహించిన సమయంలో వరదలు ముంచెత్తాయి. ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ బయటకు రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా తుఫాన్ నేపథ్యంలో నేరుగా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం లో పంట పొలాలను పరిశీలించారు. రైతులను ఓదార్చారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు తర్వాత సమీక్షలు జరుపుతూ మంచి పేరు తెచ్చుకున్నారు నారా లోకేష్. ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి విపత్తుల సమయంలోనే పాలనా దక్షత బయటపడుతుంది. సీఎం తర్వాత ఇప్పుడు లోకేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
* వారిద్దరి మాదిరిగానే..
అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో పవన్( Pawan Kalyan) బయటకు వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సక్సెస్ అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు తర్వాత లోకేష్ అన్నట్టు ఒక వాతావరణం క్రియేట్ అయింది. అయితే ఇప్పుడు తుఫాన్ నేపథ్యంలో.. పంచాయితీరాజ్ తో పాటు గ్రామీణాభివృద్ధి శాఖను చూస్తున్న పవన్ కళ్యాణ్ సైతం బయటకు వచ్చారు. రైతులతో మమేకం అయ్యారు. తద్వారా తాను కూడా ప్రజల గురించి ఆలోచిస్తున్నానని.. మంచి పాలనా దక్షుడిగా పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నట్టు కనిపిస్తున్నారు. అందుకే తన స్టైల్ మార్చారు.