IAS Krishna Teja: పవన్ మెచ్చుకున్న కలెక్టర్ ఎవరు? ఏంటా కథ?

2017 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన కృష్ణ తేజ 2023 మార్చిలో కేరళలోని త్రిశూల్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈయన స్వస్థలం పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట.

Written By: Dharma, Updated On : June 15, 2024 4:54 pm

IAS Krishna Teja

Follow us on

IAS Krishna Teja: మంచిని గుర్తించడంలో ముందుంటారు పవన్. ఏ రంగంలో ఉన్నా.. వారు మంచి చేస్తే ప్రత్యేకంగా అభినందిస్తారు. అభినందనలు తెలుపుతారు. తాజాగా తెలుగు ఐఏఎస్ కృష్ణ తేజకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం గా, మంత్రిగా నియమితులైన పవన్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు కేరళలోని త్రిశూల్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న కృష్ణ తేజకు అభినందించారు. దీంతో ఎవరా కృష్ణ తేజ అంటూ అందరూ ఆరా తీయడం ప్రారంభించారు.

2017 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన కృష్ణ తేజ 2023 మార్చిలో కేరళలోని త్రిశూల్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈయన స్వస్థలం పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. లక్షలాదిమంది చనిపోయారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈ తరుణంలో త్రిసూల్ జిల్లాలో కరోనాతో అనాథలుగా మిగిలిన 609 మంది విద్యార్థులను కలెక్టర్ కృష్ణ తేజ గుర్తించారు. వారి ఉన్నత చదువులు చదివేలా చూశారు. అలాగే భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు పింఛన్లు ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా గృహ నిర్మాణం చేపట్టారు. మరో 150 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు.

బాలల హక్కుల రక్షణలో దేశంలో త్రిశూల్ జిల్లా అగ్రగామిగా నిలిచింది. దీనిని గుర్తించిన జాతీయ బాలల హక్కుల కమిషన్.. కలెక్టర్ కృష్ణ తేజకు పురస్కారాన్ని ప్రకటించింది. 27న ఢిల్లీలో ఈ అవార్డును కృష్ణ తేజ అందుకోనున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి కృష్ణ తేజ ఎంపిక కావడం హర్షణీయమన్నారు. మరిన్ని సేవలందిస్తూ ఉద్యోగులు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కరోనా, కేరళ వరదల విపత్తుల సమయంలో ఆయన అందించిన సేవలను ప్రజలు మరిచిపోలేదని పవన్ తెలిపారు.