AP CM Jagan – Helicopter : తమిళనాడు సీఎం స్టాలిన్ దుబారా ఖర్చులు తగ్గించుకోవడంలో సక్సెస్ అయ్యారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన కాన్వాయ్ లో వాహన శ్రేణి తగ్గించారు. అసెంబ్లీలో క్యాంటీన్ మూయించారు. ఎవరి భోజనాలు వారే ఇంటి నుంచి తీసుకొని రావాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆదేశాలిచ్చారు. చివరికి మాటల్లో కూడా పొదుపు పాటించాలని సూచించారు. తనను ఎవరు పొగుడుతూ మాట్లాడవద్దని..ప్రజా సమస్యలపైనే మాట్లాడాలని కూడా పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.అయితే ఏపీలో మాత్రం అందుకు విరుద్ధం. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం కదా అని తాము ఎందుకు సకల సౌకర్యాలు పొందకూడదన్నది ఏపీ పాలకుల భావన. సీఎం జగన్ నిత్యం ఆకాశమార్గంలో ప్రయాణిస్తుండగా.. మంత్రులు బుగ్గ కార్లలో భారీ కాన్వాయ్ నడుమ ప్రయాణాలు చేస్తూ పవర్ ఎంజాయ్ చేస్తున్నారు. చివరకు కులాల కార్పొరేషన్ చైర్మన్లు సైతం వాహన శ్రేణితో హడావుడి చేస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ తాడేపల్లి నుంచి అడుగు బయటపెడితే హెలికాప్టర్ తప్పనిసరి. ఎంత దూరం అన్నది చూడడం లేదు. చివరకు విజయవాడ, గుంటూరు నగరాలకు రావాలన్నా ఆకాశమార్గం వైపే చూస్తున్నారు. రోడ్డు మార్గం తన ఒంటికి పడదన్నట్టు వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల ముందు జనం జనం అంటూ చెప్పుకొచ్చిన ఆయన ఇప్పుడు అదే జనం మధ్యకు వెళ్లేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. పథకాల బటన్ నొక్కేందుకు జిల్లాలకు వస్తున్నా పరదాల మాటున దాక్కుంటూ వెళుతున్నారు. ఎక్కువగా హెలికాప్టర్ ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కుదరకపోతే మాత్రం రోడ్డు మార్గంలో చేరుకుంటున్నారు.

తాజాగా తన ఇంటిపక్కన ఉన్న గ్రామాలను పర్యటించేందుకు జగన్ వెళుతున్నారు. ఇందుకు రెండు హెలిప్యాడ్ లను నిర్మిస్తున్నారు. అమరావతి ఆర్ 5 జోన్ లో 50 వేల మంది రాయలసీమ పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన సంగతి తెలిసిందే. పట్టాలకు సంబంధించి ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ముందుకొచ్చినట్టే వచ్చి.. పెండింగ్ కేసుల దృష్ట్యా వెనక్కి వెళ్లిపోయింది. దీంతో మీరిచ్చే సాయం ఏంటి? తానే ఇళ్లు కడతానని జగన్ తీర్మానించుకున్నారు. ఈ నెల 24న ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి అమరావతి ఆర్5 జోన్ కు వెళ్లనున్నారు. ఇందు కోసం తాడేపల్లి నుంచి బయలుదేరి వెంకటాయపాలెం, కృష్ణాయపాలెం అనే రెండు గ్రామాల్లో పర్యటిస్తారు. తాడేపల్లి వెంకటాయపాలెనికి ఆరు కిలోమీటర్లు, వెంకటాయపాలెం – కృష్ణాయపాలెం మధ్య దూరం రెండు కిలోమీటర్లు ఉంటుంది. ఈ మొత్తం ప్రయాణం పూర్తిగా హెలికాఫ్టర్ ద్వారా సాగుతుంది. ఇందు కోసం రెండు గ్రామాల్లో రెండు హెలిప్యాడ్లు రెడీ చేశారు. అసలు జనం కన్నాపోలీసుల్నే ఎక్కువగా మోహరిస్తున్నారు.
అయితే రాజధాని ప్రాంతంలో పర్యటించాలనుకుంటున్న ప్రతిసారి జగన్ ఆకాశమార్గాన్నే ఎంచుకుంటున్నారు. చేతిలో అధికారం ఉంది కదా? ఎలాంటి దర్పం అయినా ప్రదర్శించవచ్చు. కానీ అది ప్రజల సొమ్ముతోనన్న విషయాన్ని గుర్తెరగకుండా వ్యవహరిస్తుండడమే విమర్శలకు తావిస్తోంది. పాలకులు విశాల దృక్పథంతో ఆలోచించాలి. ప్రజలకు ఉచితాలు అందిస్తున్నాం కదా? అని విచ్చలవిడిగా ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటితే మూల్యం చెల్లించేది ఈ రాష్ట్ర ప్రజలే. అటు ఉచితాలు, ఇటు పాలకుల దర్పం వెరసి నష్టపోయేది మాత్రం ముమ్మాటికీ ఏపీ ప్రజలే.ఆకాశ మార్గంలో ప్రయాణాలు, పరదాల మాటున పర్యటనలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. ఇక ఆలోచించుకోవాల్సింది ఏపీ పాలకులే.