CM YS Jagan: ప్రకాశం జిల్లాపై జగన్ ఫోకస్.. అంతా ఐ ప్యాక్ చేతిలోనే..
నెల్లూరు ఎపిసోడ్ మాదిరిగా విడిచిపెడితే ప్రకాశంలో కూడా కల్లోల పరిస్థితులు తలెత్తే అవకాశముండడంతో జగన్ సీరియస్ గా దృష్టిపెట్టినట్టు సమాచారం. ప్రత్యేకంగా ప్రకాశంపై ఫోకస్ పెంచినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Written By:
Dharma , Updated On : May 6, 2023 / 06:32 PM IST
Follow us on
CM YS Jagan: మొన్న నెల్లూరు, నిన్న ప్రకాశం జిల్లా వైసీపీలో తలెత్తిన వివాదం.. సీఎం జగన్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటివరకూ వీరవిధేయత కనబరుస్తూ వస్తున్న వారే ధిక్కార స్వరం వినిపిస్తుండడంతో ఆయన డోలాయమానంలో పడిపోయారు. కావాల్సిన వారే కత్తులు దూస్తుండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. నెల్లూరు ఎపిసోడ్ మాదిరిగా విడిచిపెడితే ప్రకాశంలో కూడా కల్లోల పరిస్థితులు తలెత్తే అవకాశముండడంతో జగన్ సీరియస్ గా దృష్టిపెట్టినట్టు సమాచారం. ప్రత్యేకంగా ప్రకాశంపై ఫోకస్ పెంచినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో నియోజకవర్గాలు, మండలాల్లో ఏం జరుగుతోంది అన్న నివేదిక ఇప్పుడు సీఎం జగన్ టేబుల్ పైకి వచ్చినట్టు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో కీలక నిర్ణయాలు ఉంటాయని సమాచారం.
నాడు నెల్లూరు ఎపిసోడ్..
నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు ధిక్కార స్వరం వినిపించారు. తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఓటువేశారని హైకమాండ్ ఆరోపిస్తోంది. ఈ ముగ్గురిపై వేటు వేసింది. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారుచేసుకుంది. ఇప్పడిప్పుడే పరిస్థితి తన అదుపులోకి తెచ్చుకుంది. అయితే ఇక్కడ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న బాలినేని అంతా తానై పరిస్థితిని చక్కదిద్దారు. అయితే నెలలు గడవకముందే అదే బాలినేని ప్రకాశం జిల్లాలో వివాదాలకు కారణమయ్యాడు. పార్టీలో తన చుట్టూ కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ వైసీపీలో విభేదాలను బహిర్గతం చేశారు.
పోస్టుమార్టంతో చర్యలు..
ప్రధానంగా వైవీ సుబ్బారెడ్డిని టార్గెట్ చేసుకుంటూ బాలినేని కామెంట్స్ చేశారు. భావోద్వేగానికి గురయ్యారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వైఎస్సార్ కుటుంబాన్ని, జగన్ ను విడిచిపెట్టి వెళ్లనని తేల్చిచెప్పారు. దీంతో సీఎం జగన్ సైతం కలవరపాటకు గురయ్యారు. ఆ ఇద్దరు నేతలు కావాల్సిన వారే కావడంతో..అసలు జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఐ ప్యాక్ బృందం తో నివేదికను తెప్పించుకున్నారు. దీనిపై పోస్టుమార్టం చేసి తదుపరి చర్యలకు ఉపక్రమించనున్నారు. ఇంతలో ఒకరి నియోజకవర్గంలో ఒకరు వేలిపెట్టొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం.
అధినేత ఆగ్రహం..
బాలినేని మీడియా ముందుకు రావడంపై జగన్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నెల్లూరు జిల్లా పరిణామాలతో ఆచీతూచీ వ్యవహరిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి బాలినేనిని ఏకాకి చేసి వైవీ సుబ్బారెడ్డి జిల్లాపై పట్టుబిగించినట్టు టాక్ నడుస్తోంది. వాస్తవానికి బాలినేని, వైవీ బావాబామ్మర్దులు అయినప్పటికీ, ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.తనకు వ్యతిరేకంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లను వైవీ ఉసిగొల్పుతున్నట్టు బాలినేని బలంగా నమ్ముతున్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఆమంచి కృష్ణమోహన్, ఇలా అందరితోనూ బాలినేనికి వైరమే. మంత్రి పదవి పోవడం, జగన్ వద్ద పలుకుబడి తగ్గిందనే సమాచారంతో బాలినేనిపై సొంత పార్టీ ముఖ్యులు ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో జగన్ వద్దకు వచ్చిన నివేదికలో ఏముంది? ఎటువంటి చర్యలకు దిగుతారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.