CM Chandrababu Tours: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. ఏడుపదుల వయసులో కూడా.. ఆయన కష్టపడుతున్న తీరు అభినందనీయమే. ప్రస్తుతం ఆయన లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన సతీమణి భువనేశ్వరికి అత్యుత్తమ అవార్డులు వచ్చాయి. ఆ అవార్డుల స్వీకరణకు గాను ఆయన సతీమణితో కలిసి లండన్ వెళ్లారు. అదే సమయాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకుంటున్నారు. వచ్చే నెలలో విశాఖ వేదికగా జరగనున్న పెట్టుబడుల సదస్సుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను స్వాగతిస్తున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆహ్వానిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు గత కొద్దిరోజులుగా చేస్తున్న పెట్టుబడుల ప్రయత్నాలపై ఏపీవ్యాప్తంగా సంతృప్తి కనిపిస్తోంది. ప్రస్తుతం లండన్ పర్యటన కూడా ప్రతిష్టాత్మకంగా మారింది.
* గట్టి ప్రయత్నాలు..
ఏపీలో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతోంది. నాలుగో సారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అది మొదలు ఆయన ఈ రాష్ట్రానికి ఏదో చేయాలన్న తలంపుతోనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు పలుమార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. దావోస్ లో పెట్టుబడుల సదస్సు మొదలు మొన్నటి సింగపూర్ పర్యటన వరకు ప్రతిదీ రాష్ట్రం కోసమే. అయితే లండన్ పర్యటనలో భాగంగా విశాఖపట్నం ఆహ్వానించాలని భావించారు. ఇంతలోనే ఆయన సతీమణి భువనేశ్వరికి ప్రతిష్టాత్మకంగా రెండు అవార్డులు లభించాయి. ఒకవైపు వ్యక్తిగత పర్యటన సాగిస్తూనే రాష్ట్రానికి పెట్టుబడుల అన్వేషణ కోసం చంద్రబాబు ప్రస్తుతం లండన్ లో బిజీగా ఉన్నారు.
* విశాఖలో పెట్టుబడుల సదస్సు..
విశాఖలో ( Visakhapatnam) ఈనెల 14 నుంచి మూడు రోజులపాటు పెట్టుబడుల సదస్సు జరగనుంది. దాదాపు పదిలక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రకాల ఒప్పందాలు జరిగాయి. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. అమెరికా వెలుపల, ఆసియా ఖండంలో అతిపెద్ద డేటా సెంటర్ ఇది. దానితోపాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం వచ్చాయి. అయితే పది లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఉద్యోగాల విషయంలో ఉత్తరాది రాష్ట్రాల వారు కూడా ఉంటారు. కానీ అన్నింటికీ మించి ఈ రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం సమకూర్తుంది. ఆపై మౌలిక వసతుల కల్పనలో భాగంగా రియల్ ఎస్టేట్ కు ఎనలేని ప్రాధాన్యము లభిస్తుంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఏ సమావేశం జరిగిన ఏపీ గురించి చర్చ జరుగుతోంది. తద్వారా ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తే రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అదే అవసరం కూడా. చంద్రబాబు ఆశపడుతోంది అదే.