AP Cabinet expansion: ఏపీలో( Andhra Pradesh) మంత్రివర్గ విస్తరణ చేపడతారా? మంత్రివర్గంలో సమూల ప్రక్షాళన చేస్తారా? ఎన్నికల టీం వస్తుందా? పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతోంది. మరో 8 నెలలు అయితే రెండేళ్ల పాలన పూర్తవుతుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో దాదాపు కొత్తవారే. వారిని నియమించినప్పుడే విస్తరణ ఉంటుందని చెప్పారని ప్రచారం నడుస్తోంది. మరోవైపు చూస్తే సీనియర్లు చాలామంది మంత్రి పదవులు కోసం ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు.. అదిగో ఇదిగో అంటూ మంత్రివర్గ విస్తరణ పై తెగ ప్రచారం నడిచింది. కానీ అటువంటి నిర్ణయం ఏది ప్రకటించలేదు.
ఒక మంత్రి పదవి ఖాళీ
ప్రస్తుతం క్యాబినెట్లో( cabinet) 24 మంది మంత్రులు ఉన్నారు. అందులో జనసేనకు చెందిన ముగ్గురు, బిజెపి నుంచి ఒకరు, టిడిపి నుంచి 19 మంది ఉన్నారు. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. రాజ్యసభ పదవుల సర్దుబాటులో భాగంగా మెగా బ్రదర్ నాగబాబు కు అవకాశం చిక్కలేదు. దీంతో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఆయనను ఎమ్మెల్సీ చేశారు. త్వరలో మంత్రి పదవిలోకి తీసుకుంటారని ప్రచారం నడిచింది. కానీ మంత్రివర్గ విస్తరణ వరకు ఆయన వేచి ఉండక తప్పదు. ఎందుకంటే నాగబాబుకు ఇవ్వాలనుకుంటే ఒక మంత్రి పదవి ఖాళీ ఉంది. కానీ అలా చేయలేదు.
ప్రజల నుంచి సంతృప్తి..
ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై(Alliance government) ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. పాజిటివ్ వేవ్స్ సైతం ఉన్నాయని సర్వేల్లో తేలుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుండడంతో పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. మరోవైపు సంక్షేమ పథకాలు కూడా అమలవుతున్నాయి. వైసిపి హయాంలో కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే అమలు చేసేవారు. ఇప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టింది కూటమి. అయితే ఇది ప్రభుత్వం పై సానుకూలంగా మారుతోంది. కానీ దీనిపై మంత్రులు ప్రచారం చేసుకోలేకపోతున్నారన్న విమర్శ ఉంది. పనితీరులో వెనుకబడి పోతున్నారన్న ప్రచారం ఉంది. అందుకే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న టాక్ నడుస్తోంది.
సాహసం చేస్తారా?
అయితే చంద్రబాబు( CM Chandrababu) అనవసరంగా తేనె తుట్టను కదులుస్తారా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మంత్రి పదవుల కోసం కూటమిలోనే చాలామంది నేతలు ఎదురుచూస్తున్నారు. అందులో సీనియర్లు సైతం ఉన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అటువంటి వారి జాబితా పదుల సంఖ్యలో ఉంది. ఇప్పుడు అనవసరంగా కెలికి మంత్రి పదవులు భర్తీ చేస్తారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే కచ్చితంగా ప్రజలనుంచి సంతృప్తి స్థాయి ఉండడంతో.. పూర్తిగా ఎన్నికలను ఉద్దేశించి.. కొత్త టీం రంగంలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. సీనియర్లతో పాటు జూనియర్లకు సైతం మంత్రివర్గంలో స్థానం ఉంటుందని కొత్త టాక్ అయితే తెరపైకి వచ్చింది. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.