AP BJP: ఎన్డీఏలో టిడిపి ఎంట్రీ లాంఛనమే. టిడిపి, జనసేన కూటమిలోకి బిజెపి సైతం రానుంది. ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ సైతం ప్రారంభమైంది. టిడిపి, జనసేనతో కలిసేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సుముఖత వ్యక్తం చేస్తున్నారు.బిజెపి హై కమాండ్ ఇష్టమేనని చెబుతూనే.. గత కొద్దిరోజులుగా పొత్తుకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ప్రారంభంలో పొత్తును వ్యతిరేకించిన బిజెపి నేతలు సైతం ఇటీవల మౌనం పాటించారు. తమ పని తాము చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ పదవులను ఆశిస్తున్న వారు పొత్తుకు అనుకూలంగా ఉండగా.. పార్టీ అభివృద్ధిని కోరుకుంటున్న వారు మాత్రం పొత్తును వ్యతిరేకిస్తున్నారు. బిజెపి ఒంటరిగా ఎదగాలని భావిస్తున్నారు.
వాస్తవానికి చాలామంది బిజెపి నాయకులకు చంద్రబాబు అంటే పడదు. ఏపీలో బిజెపిని ఎదగనీయకుండా చేయడంలో చంద్రబాబుది ప్రధాన పాత్ర. గత ఎన్నికల ముంగిట ఎన్డీఏకు చంద్రబాబు గుడ్ బై చెప్పారు. రాష్ట్ర విభజన తో పాటు విభజన హామీల అమలులో బిజెపి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఆ కామెంట్స్ ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. దాని ఫలితంగానే గత ఎన్నికల్లో నోటా అంటే తక్కువ ఓట్లు బిజెపికి లభించాయి. దీనికి చంద్రబాబు కారణమని మెజారిటీ బిజెపి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పైగా ఎన్డీఏను విడిచిపెట్టినప్పుడు.. రెండుసార్లు కూడా చంద్రబాబు బీజేపీపై ఆరోపణలు చేసి బయటకు వెళ్లారు. బిజెపిని టార్గెట్ చేసుకొని మాట్లాడారు.
1999, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి బీజేపీతో పొత్తు కలిసి వచ్చిందన్నది ఒక విశ్లేషణ. 2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు బీజేపీని వదులుకున్నారు. వామపక్షాలతో పాటు నాడు టిఆర్ఎస్ గా ఉన్న కేసీఆర్ ను దగ్గరకు తీసుకున్నారు. మళ్లీ 2014 ఎన్నికల్లో బిజెపితో స్నేహం ఏర్పరచుకుని అధికారంలోకి రాగలిగారు. 2018లో బిజెపి స్నేహాన్ని వదిలించుకుని.. కాంగ్రెస్ పక్షాన చేరారు. ప్రధాని మోదీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. అటు తిరుపతి వచ్చిన అమిత్ షా కారుపై రాళ్లు వేయించారన్న ఆరోపణలు ఉన్నాయి.
గత పరిణామాల దృష్ట్యా చంద్రబాబుతో స్నేహం మంచిది కాదని బిజెపి హాట్ కోర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. బిజెపి దన్నుతో మరోసారి అధికారంలోకి రావాలని చంద్రబాబు భావిస్తున్నారని.. తీరా పవర్ లోకి వచ్చాక యూటర్న్ తీసుకుంటారని చెబుతున్నారు. ఈ పరిణామాల క్రమంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు స్పందించారు. గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే బిజెపి హై కమాండ్ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని పొత్తు పెట్టుకోవాలని సూచించారు.