AP Alliance MLAs: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. గత ఏడాది జూన్ 4న ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూటమి ఘనవిజయం సాధించింది. చివరకు రాయలసీమలో సైతం ఏకపక్ష విజయం సాధించింది. వైసీపీ కీలక నేతలు సైతం ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో రాయలసీమలో మూడు చోట్ల మాత్రమే టిడిపి విజయం సాధించింది. అటువంటిది 2024 ఎన్నికల్లో 33 చోట్ల విజయం సాధించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది చోట్ల గెలుపొందింది. అయితే ఇప్పుడు ఏడాది పాలన పూర్తవుతున్న క్రమంలో.. ప్రజాభిప్రాయం పేరిట సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా ఓ ప్రముఖ సర్వే తమ ఫలితాలను వెల్లడించింది. అందులో ఆసక్తికర ఫలితాలు వెలుగు చూసాయి.
ఆసక్తికర ఫలితాలు..
కూటమి( Alliance ) ఏడాది పాలనలో వైఫల్యం చెందిందని వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ప్రభుత్వం పై పోరుబాట ప్రారంభించారు. ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేశారు. ఇటువంటి సమయంలో రాయలసీమలో కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై ఓ ప్రముఖ సర్వే సంస్థ తమ ఫలితాలను వెల్లడించింది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కూటమికి అనుకూలంగా ఇదే సంస్థ ఫలితాలు ఇచ్చింది. 2024 ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధిస్తుందని కూడా తేల్చి చెప్పింది. అయితే తాజా సర్వేలో 2024 కి భిన్నంగా రాయలసీమలో పరిస్థితులు ఉన్నట్లు స్పష్టం చేసింది. రాయలసీమలో అత్యధికంగా 33 మంది కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు వెల్లడించింది. 29 మంది కొత్త ఎమ్మెల్యేలకు కష్టమేనని కుండ బద్దలు కొట్టి చెప్పింది. రాయలసీమలో ఐదుగురు మంత్రులకు గాను నలుగురు రెడ్ జోన్ లో ఉన్నట్లు స్పష్టం చేసింది. దీంతో కూటమికి ప్రమాదం తప్పవని తేలింది.
Also Read: MLA Adinarayana Reddy: కూటమి ఎమ్మెల్యే రాజీనామా ప్రకటన.. ఏపీలో సంచలనం!
ఆ రెండు స్థానాలు మినహాయించి..
చిత్తూరు ( Chittoor)పార్లమెంటు స్థానంలో కుప్పం, పలమనేరు తప్పించి మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నట్లు తాజా సర్వే చెబుతోంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్న విషయాన్ని సర్వేలో స్పష్టమైంది. టిడిపి సీనియర్ల నియోజకవర్గాలు, వైయస్సార్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం పదిలంగా ఉన్నట్లు సర్వే తేల్చి చెప్పింది. ప్రస్తుతం రాయలసీమలో వైసీపీకి సంబంధించి పులివెందులలో జగన్మోహన్ రెడ్డి, బద్వేలులో దాసరి సుధా, రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి, మంత్రాలయంలో బాలనాగిరెడ్డి, ఆలూరులో విరూపాక్షి, తంబాలపల్లి లో ద్వారకానాథ్ రెడ్డి, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. వీరంతా వచ్చే ఎన్నికల నాటికి పదిలంగా ఉంటారని సర్వే చెబుతోంది. అయితే దీనిపై కూటమి పార్టీలు పెదవి విరుస్తున్నాయి. సర్వే నమ్మదగినదిగా లేదు అని కొట్టిపారేస్తున్నాయి. లోలోపల మాత్రం కూటమి పార్టీల శ్రేణులకు బెంగ వెంటాడుతోంది.