YSRCP : వైసీపీలో మరో ఎమ్మెల్యే అవుట్

తనను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు సొంత పార్టీ నేతలే పావులు కదుపుతుండడంతో ఎమ్మెల్యే రాంబాబు ఆందోళనకు గురవుతున్నారు. హైకమాండ్ కు ఫిర్యాదుచేసినా పెద్దగా పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు.

Written By: Dharma, Updated On : July 17, 2023 11:31 am
Follow us on

YSRCP : ఏపీలో జంపింగ్ జపాంగులు ప్రారంభమయ్యాయి. ఎన్నికలకు పట్టుమని పది నెలలు లేకపోవడంతో నేతలు పక్కచూపులు ప్రారంభించారు. రాజకీయ భవిష్యత్ ను వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి జంపింగ్ నేతలు కనిపిస్తున్నారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పదవికి, పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసింది. అది మరువక ముందే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేయనని తేల్చేశారు. అధికార వైసీపీలో కుల రాజకీయాలు తట్టుకోవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీ ప్రాభవం మసకబారుతోంది. వైసీపీ ఆవిర్బావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న జిల్లా ప్రస్తుతం దయనీయ పరిస్థితికి చేరుకుంటుంది. మంత్రి పదవి తొలగించడంతో బాలినేని కీనుక వహించారు. వైవీ సుబ్బారెడ్డితో ఢీ అంటే ఢీకొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు పార్టీ టిక్కెట్ కష్టమేనన్న టాక్ నడుస్తోంది. మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నా ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. చీరాల సెగ తెగ రగులుతోంది. తాజాగా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా ఓపెన్ అయ్యారు. రెడ్డి సామాజికవర్గంతో పడలేనని.. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశ్యం లేదని తేల్చేశారు. ఆ విషయాన్ని బాహటంగానే చెప్పేశారు.

గత ఎన్నికల్లో గిద్దలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన అన్నా రాంబాబు 83 వేల భారీ మెజార్టీతో గెలుపొందారు. కానీ ఇంతటి మెజార్టీకి తామే కారణమని కొందరు రెడ్డి సామాజికవర్గ నేతలు చెబుతున్నారు. గత నాలుగేళ్లుగా ప్రతీ పనికి అడ్డుతగులుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం కీ రోల్ ప్లే చేసేలా పావులు కదుపుతున్నారు. దీంతో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎమ్మెల్యే రాంబాబుకు వ్యతిరేకంగా బలమైన వర్గాన్ని కూడదీయడంలో రెడ్డి సామాజికవర్గం నేతలు సక్సెస్ అయ్యారు. ఇది ఎమ్మెల్యేకు మింగుడుపడడం లేదు.

తనను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు సొంత పార్టీ నేతలే పావులు కదుపుతుండడంతో ఎమ్మెల్యే రాంబాబు ఆందోళనకు గురవుతున్నారు. హైకమాండ్ కు ఫిర్యాదుచేసినా పెద్దగా పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. అందుకే రెండురోజుల కిందట గడపగడపకూ మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశ్యం లేదన్నారు. అనవసరంగా డబ్బులు పోగొట్టుకోదలచుకోలేదని.. తన ఓటమికి సొంత పార్టీ నాయకులే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే ఓ కఠిన నిర్ణయాన్ని వెల్లడించేందుకు కూడా వెనుకాడబోనని సంకేతాలిచ్చారు. సో వైసీపీలో మరో ఎమ్మెల్యే వికేట్ డౌన్ అన్న మాట.