Huge investment for AP: ఏపీకి( Andhra Pradesh) పెట్టుబడుల వరద వస్తోంది. రాజకీయాల గురించి పక్కన పెడితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పరిశ్రమలతో పాటు ఐటీ సంస్థలు వస్తున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు కనిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో మరో భారీ పెట్టుబడి ఏపీకి వస్తుందని ఢిల్లీ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలోనూ.. అనుమతులు తీసుకురావడంలోనూ.. ఏపీ ప్రభుత్వం చాలా చొరవ చూపుతోంది. ఆపై పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తోంది. భారీగా భూములు కేటాయిస్తోంది. దీంతో దిగ్గజ పరిశ్రమలు ఏపీ వైపు చూస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు కాదని ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా విశాఖలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండడం విశేషం. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. ఒకవైపు పాలనను చూస్తూనే.. మరోవైపు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
డేటా పాలసీ మార్పు..
విశాఖకు ప్రపంచ ఐటీ దిగ్గజ గూగుల్( Google) వచ్చింది. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే అంతటి దిగ్గజ ఐటీ సంస్థ విశాఖకు రావడానికి ప్రధాన కారణం చంద్రబాబు, నారా లోకేష్. ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ వెళ్లడం ద్వారానే పెట్టుబడులు వచ్చాయి. సాధారణంగా డేటా సెంటర్ పాలసీ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. అయితే దేశంలో చాలా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ ముందుకు వచ్చింది. ముఖ్యంగా డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి కొన్ని రకాల మినహాయింపులు ఇచ్చింది. అయితే కేంద్రం తో మాట్లాడి అవన్నీ చేయలేక కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చేతులు ఎత్తేసాయి. ఇటువంటి తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి నారా లోకేష్.. నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, అశ్విని వైష్ణవ్తో తరచూ మంతనాలు చేసేవారు. ఏకంగా డేటా పాలసీలో మార్పులు తీసుకొచ్చి.. రాయితీలు కల్పించారు. దీంతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ముందుకు వచ్చింది.
భారీగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు..
విశాఖకు ఐటీ సంస్థలే కాదు.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వచ్చాయి. అనకాపల్లి జిల్లాలో( Anakapalli district) మిట్టల్ కంపెనీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అంతకుముందు చాలా రాష్ట్రాలు ఆ పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరాయి. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనుమతుల విషయంలో వెనుకబడ్డాయి. మీకు భూములు అయితే కేటాయిస్తాం కానీ కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశాయి. అటువంటి సమయంలోనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమయస్ఫూర్తి చాటారు. కేంద్ర పెద్దలతో మాట్లాడి అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా శరవేగంగా భూముల సేకరణ చేపట్టారు. అందుకే మిట్టల్ లాంటి భారీ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. అయితే ఇప్పుడు ఇదే స్ఫూర్తితో మరో భారీ పరిశ్రమ ఏపీకి రానున్నట్లు ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ సర్కిల్ లో ఇదే ప్రచారం జరుగుతోంది. ఈనెల 14 నుంచి మూడు రోజులపాటు విశాఖలో పెట్టుబడుల సదస్సు జరగనుంది. అందులో ఈ భారీ పెట్టుబడికి సంబంధించిన ఒప్పందం జరగనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.