Another greater city: అమరావతి రాజధాని( Amravati capital) నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రాజధాని లో నవ నగరాలు నిర్మించాలన్నది చంద్రబాబు ప్రణాళిక. మరోవైపు విజయవాడ, గుంటూరు నగరాలతో అమరావతిని కలుపుతూ అభివృద్ధి చేస్తారని అంతా భావించారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వేరే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతికి ఇంకా నగర రూపురేఖలు ఏర్పడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచిస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ఐటీ కంపెనీలను తీసుకురావాలన్న ఆలోచనతో ఉంది. అందుకే ఇప్పుడు విజయవాడ ను గుర్తించి గ్రేటర్ గా మార్చాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 75 గ్రామపంచాయతీలను విజయవాడ నగరపాలక సంస్థలో విలీన ప్రతిపాదన త్వరలో అమలు చేయనున్నట్లు సమాచారం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ను గ్రేటర్ సివిక్ బాడీగా అప్గ్రేడ్ చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
సీఎం చంద్రబాబుకు ప్రతిపాదనలు..
ఈరోజు విజయవాడ( Vijayawada) ఎంపీ కేశినేని చిన్ని తో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సీఎం చంద్రబాబు నాయుడు ను కలిసి మహా విజయవాడ ప్రతిపాదనలను అందించారు. దీంతో విజయవాడ మహానగరం ఆవిర్భావానికి అడుగులు పడినట్లు అయింది. 2017లో నగరపాలక మండలి 51 పంచాయితీల విలీనం ప్రతిపాదన చేయగా.. ఇప్పుడు ఆ జాబితాలో మరో 24 పంచాయితీలను చేర్చారు. దీంతో విజయవాడ ప్రస్తుత జనాభా 23.5 లక్షల నుంచి రెట్టింపు కానుంది. నగర పరిమాణం ఐదు రెట్లు పెరగనుంది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రస్తుతం ఉన్న 61.8 చదరపు కిలోమీటర్ల నుంచి.. 500 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది.
విశాఖను దాటి..
ఈ విలీన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం ఆమోదిస్తే.. విశాఖపట్నం( Visakhapatnam) దాటి రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా విజయవాడ అవతరించనుంది. అయితే ఈ విలీన ప్రతిపాదనను చాలామంది వ్యతిరేకిస్తున్నారు. విలీనం కాకుండా వికేంద్రీకరణ కావాలని కోరుతున్నారు. ఈ ప్రతిపాదనపై పౌర సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడ ఆంధ్రప్రదేశ్ లో రెండో అతిపెద్ద నగరంగా ఉంది. గ్రేటర్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కొన్ని వర్గాలు వ్యతిరేకించడం జరుగుతోంది. గతంలో హైదరాబాద్ విషయంలో కూడా ఇలానే జరిగింది. ప్రభుత్వం మాత్రం స్ట్రాంగ్ గా నిర్ణయించుకుంటే మాత్రం విజయవాడ గ్రేటర్ గా మారడం ఖాయం.
కేవలం ఆ కారణంతోనే..
అయితే తాజాగా విజయవాడను గ్రేటర్ సిటీగా( greater City) మార్చాలన్న ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో.. అమరావతిలో కలపాలన్న డిమాండ్ తెరమరుగు అయినట్టే. అయితే ఇప్పుడు రాష్ట్రానికి రాజధానికి దగ్గరగా ఒక నగరం అవసరం. ఐటీ పరిశ్రమలన్నీ విశాఖకు వెళ్ళిపోతున్నాయి. రాయలసీమలో తయారీ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. ఈ క్రమంలో అమరావతి రాజధాని లో ఎటువంటి పెట్టుబడులు లేవన్న విమర్శలు వస్తున్నాయి. అందుకే గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనను ఆమోదించి.. మహానగరంలో పెట్టుబడులు ఆకర్షించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.