Amaravati: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. 2028 నాటికి రాజధానికి ఒక రూపం తేవాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణీత గడువులోక ప్రధాన భవన సముదాయాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులతో పాటు అమరావతి రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరుతూ.. ఆ మధ్య సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు సింగపూర్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఓ దేశం ముందుకు వచ్చింది.
Also Read: అలాస్కా లో రహస్య పత్రాలు.. ట్రంప్, పుతిన్ భేటీ లో ఇన్ని భద్రతా లోపాలా?
* సింగపూర్ విముఖత..
ఐదు రోజుల పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు బృందం( CM Chandrababu team) సింగపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ దేశమంత్రులతో సైతం సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. మంత్రి టాన్ సి లంగ్ తో చంద్రబాబు స్వయంగా భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణంలో భాగం కావాలని కోరారు. దీనికి ఆయన అంగీకరించలేదంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా మరో దేశం అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. సింగపూర్ కు బదులుగా వియత్నం ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమరావతిలో రెండు వేల ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేసేందుకు వియత్నం ముందుకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
* స్టార్టప్ ఏరియా అభివృద్ధి
నవ నగరాల్లో అమరావతిని నిర్మించాలన్నది చంద్రబాబు ప్రణాళిక. అందులో భాగంగా స్టార్టప్ ఏరియాను( startup area ) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చంద్రబాబు. దానిని అభివృద్ధి చేయడం ద్వారా అమరావతికి ఒక తుది రూపం తీసుకురావాలని భావిస్తున్నారు. గతంలో ఆ బాధ్యతను సింగపూర్ కు అప్పగించారు. అయితే 2019లో ప్రభుత్వం మారడం.. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రాజధానుల వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో దానికి బ్రేక్ పడింది. అప్పట్లో సింగపూర్, సి ఆర్ డి ఏ మధ్య 1679 ఎకరాల స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ఒప్పందం కుదిరింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సింగపూర్ ప్రతినిధులను దారుణంగా అవమానించింది. రకరకాలుగా అమరావతిపై విషం చిమ్మింది. ఇప్పుడు కూడా చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటన నేపథ్యంలో విపరీతమైన మెయిల్స్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో వియత్నం ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో పాలు పంచుకునేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.