Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ను( Visakha steel plant) ప్రైవేటీకరణకు సంబంధించిన వివాదం నడుస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వ అడుగులు చూస్తుంటే ప్రైవేటీకరణ తప్పదని అనిపిస్తోంది. ఇప్పటికే పార్లమెంట్లో సైతం అటువంటి వ్యాఖ్యలు వచ్చాయి. కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి అటువంటిదేమీ లేదని ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తున్నారు. ఈ గందరగోళ పరిస్థితుల నడుమ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మరో 600 మంది ఉద్యోగులకు విఆర్ఎస్ ఇచ్చేందుకు సిద్ధపడిందన్న ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఉన్న వేలాది మంది శాశ్వత ఉద్యోగులను వదిలించుకోవాలని భావిస్తోంది. రెండుసార్లు స్వచ్ఛంద పదవీ విరమణకు సంబంధించి అవకాశమిచ్చింది. ఇప్పుడు మూడోసారి మరో 600 మంది ఉద్యోగులకు విఆర్ఎస్ ఇవ్వాలని చూస్తోంది.
* నిధులు ఇచ్చినా..
కేంద్ర ప్రభుత్వం ( central government) విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11 వేల కోట్లకు పైగా సాయం అందించింది. అయినా పరిస్థితి గాడిలో పడడం లేదు. ముడి సరుకు కొరత, నిధుల లేమితో ఇబ్బంది పడుతోంది. సరైన ఉత్పత్తి కూడా జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయిస్తేనే ప్రయోజనం తప్పించి.. నిధుల సర్దుబాటుతో ఎంత మాత్రం ప్రయోజనం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. మరోవైపు స్వచ్ఛంద పదవీ విరమణ ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగులు తగ్గిపోతే ఆటోమేటిక్ గా ఉత్పత్తి కూడా పడిపోతుంది. దానిని సాకుగా చూపి ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన అన్నట్లు తెలుస్తోంది.
* మరో 600 మంది టార్గెట్..
తాజాగా విఆర్ఎస్ ( voluntary retirement scheme) ద్వారా 600 మంది ఉద్యోగులను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ 350 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కనీసం ఉద్యోగుల జీతాలు ఇచ్చేందుకు కూడా యాజమాన్యం ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న దసరా బోనస్ లు కూడా అందలేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్లో పనిచేయడం కష్టమని భావిస్తున్నారు. 15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని.. 45 సంవత్సరాలు వయసు దాటిన వారు విఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం సూచించింది. దీంతో ఉండి ఉద్యోగ భద్రత పొందకపోవడం కంటే పదవీ విరమణ చేయడం ఉత్తమమని ఎక్కువమంది భావిస్తున్నారట. అందుకే వీఆర్ఎస్ తీసుకుంటున్నారట. అయితే స్టీల్ ప్లాంట్ విషయంలో అదే గందరగోళం కొనసాగుతూనే ఉంది. దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.