AP Weather Forecast: ఏపీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు తీవ్ర వేడిగాలులు వీస్తుండగా.. ఇంకోవైపు వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. అదే స్థాయిలో చిరుజల్లులు పలకరిస్తున్నాయి. మరో మూడు రోజులపాటు ఇదే విభిన్న పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే అప్పటివరకు తీవ్ర వేడి గాలులు వీచి.. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షాలు ప్రారంభం అయితే.. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. ఉరుములతో కూడిన వాన విషయంలో మాత్రం రైతులు, పశువుల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
* ఈ జిల్లాల్లో వర్షాలు..
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీచేసింది.
* భారీ ఉష్ణోగ్రతలు..
మరోవైపు ఈరోజు ఎండల తీవ్రత కూడా అధికంగా ఉండనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 56 మండలాల్లో తీవ్రవడగాలులు, 51 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి ఉంది. గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అందుకే అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. మరో మూడు రోజుల పాటు ఇలానే ఉంటుంది అని చెబుతోంది.
