Andhra Pradesh Tourism: పిల్లలకు సెలవులు వస్తున్నాయి. దాదాపు 45 రోజులపాటు వేసవి సెలవులు. ఏడాది పొడవునా ఉరుకులు, పరుగుల జీవనం. జీవితమే ఒక యాంత్రికరణ అనేలా మారింది వాతావరణం. ఇటువంటి సమయంలో ఆటవిడుపుగా ఉండేందుకు ఎక్కువమంది వేసవిలో పర్యాటక ప్రాంతాలను పిల్లలతో హాయిగా గడుపుతామని చాలామంది ప్లాన్ చేస్తుంటారు. కొంతమంది గోవా వెళుతుంటారు. మరి కొంతమంది కొడైకెనాల్ వంటి ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తారు. మరికొందరు అయితే కేరళలో రమణీయతను ఆస్వాదించేందుకు వెళుతుంటారు. అయితే చాలామందికి తెలియదు ఏపీలో సైతం అటువంటి ప్రకృతి రమణీయ ప్రాంతాలు అందుబాటులోకి వచ్చాయని. సహజ సిద్ధ వాతావరణంతోనే పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి ఏపీలోని మన్యప్రాంతాలు. అటువంటి వాటిలో పోలవరం జిల్లా ఒకటి. ఆ జిల్లాలోని రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలో 12 మండలాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రకృతి రమణీయతకు నెలవుగా మారుతున్నాయి. కేరళ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఒక్కసారి వెళితే మరోసారి వెళ్లాలని ఆత్రుత కచ్చితంగా కనిపిస్తుంది.
* కూల్ ప్లేస్ మారేడుమిల్లి..
అత్యంత శీతల వాతావరణానికి కేంద్రంగా నిలుస్తుంది మారేడుమిల్లి. రాజమండ్రి కి 80 కిలోమీటర్ల దూరంలో.. కాకినాడకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మారేడుమిల్లి ప్రాంతం. చుట్టూ దట్టమైన అడవులు, మధ్యలో జలతరంగిణి, అమృత ధార, వలస, దుంపవలస, రాకోట జలపాతాలు ఉన్నాయి. ప్రకృతి అందాలకు నెలవైన గుడిసె కొండ, చావటికోట వ్యూ పాయింట్లు ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ప్రధానంగా గుడిస కొండ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఒంపులు తిరుగుతూ ఉండే ఈ రహదారిపై ప్రయాణం చాలా ఉద్విగ్న భరితంగా ఉంటుంది. భోజన ప్రియులకు కూడా ఈ ప్రాంతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. బొంగు చికెన్, బొంగు బిర్యానీలు ఇక్కడ ప్రత్యేక వంటకాలు. నడి వేసవిలో సైతం ఇక్కడ కాఫీ, రబ్బర్ తోటలు పచ్చదనాన్ని ఇస్తాయి. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే మార్గంలో ఘాట్ రోడ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
* రంపచోడవరం మన్య ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ రంప గ్రామంలో శతాబ్దాల కిందటనాటి పురాతన శివాలయం ప్రత్యేక ఆకర్షణ. రంప కొండపై జలపాతం ఉంటుంది. సమీపంలో మరో శివాలయం ఉంటుంది. మరోవైపు ఐ. పోలవరం వద్ద సీతపల్లి వాగు పరిసరాలు మనసును దోచుకుంటాయి. భూపతిపాలెం సాగునీటి ప్రాజెక్టు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది.
* పొల్లూరు జలపాతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. నిత్యం నీటి గలగలలతో సాగుతూ ఉంటుంది. ఎత్తయిన కొండల నుంచి జాలువారే నీరు నిత్యం పర్యాటకులను కనువిందు చేస్తోంది. ఆ మధ్యన వచ్చిన పుష్ప సూపర్ హిట్ చిత్రం షూటింగ్ ఇక్కడే జరిగింది.
* గలగల పారుతున్న గోదారిలా అంటూ పాట గుర్తుకు వస్తుంది ఇక్కడ నదిని చూసి.. గోదావరిలో జలవిహారం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. పాపికొండల నడుమ నుంచి గోదావరి నదిపై బోట్లలో వెళ్తూ ఆ సోయగాన్ని వీక్షించడం మరిచిపోలేని అద్భుత మధుర అనుభూతి.
* మరోవైపు సుందర ప్రదేశంగా చీకు ధార నిలుస్తుంది. రాజవొమ్మంగి మండలంలో ఇది ఉంది. పైనుంచి జాలువారే జలం ఇక్కడ ప్రత్యేకత. రాజవొమ్మంగి నుంచి అప్పలరాజుపేట మీదుగా అమ్మి రేకుల గ్రామం వద్దకు వెళ్తే ఇది కనిపిస్తుంది.
* పింజరి కొండపై నిత్యం వందలాదిమంది పర్యాటకులు ఉంటారు. అడ్డతీగలకు పూత వేటు దూరంలో ఈ పింజరి కొండ జలపాతం ఉంటుంది. ఇక్కడ చాపలా పరుచుకున్న రాళ్లపై నీరు జాలువారడం ప్రత్యేకత. పర్యాటకుల మనసు దోచుకుంటుంది ఈ ప్రాంతం.
* కేవలం పర్యాటకంగానే కాదు ఆధ్యాత్మికంగానూ ఈ ప్రాంతంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. రంప శివాలయం తో పాటు సీతపల్లి లోని మాతృశ్రీ గుడి బాపనమ్మ ఆలయంతో పాటు ధారకొండ లోని మాతృశ్రీ దారాలమ్మ ఆలయం, దేవీపట్నం మండలంలోని గుండి పోశమ్మ ఆలయం ప్రముఖమైనవి. కేరళలోని అందాలకు తక్కువ కాకుండా పోలవరం జిల్లాలో ప్రకృతి రమణీయత పంచే చాలా ప్రదేశాలు ఉన్నాయి. మరి ఎందుకు ఆలస్యం వేసవి ప్లాన్ చేసుకోండి..