AP Govt Advisors: ఏపీలో( Andhra Pradesh) సలహాదారుల నియామకం జరుగుతోంది. తాజాగా కార్టూనిస్ట్ శ్రీధర్, డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు సలహాదారులుగా నియమితులయ్యారు. దీంతో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసిపి హయాంలో సైతం చాలామంది సలహాదారులను నియమించారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా నియమిస్తున్నారు. అయితే అప్పటికీ.. ఇప్పటికీ ఒక తేడా కనిపిస్తోంది. గతంలో రాజకీయ నిరుద్యోగం కోసం భర్తీ చేసేవారు. ఇప్పుడు ఆయా రంగాల్లో నిపుణులను నియమిస్తున్నారు. సలహాదారులు అనేది రాజకీయ కోణంలో నియామకాలు జరగడం లేదు. చివరకు ఢిల్లీలో ఏపీ ప్రతినిధిగా కూడా ఐపీఎస్ అధికారిని నియమించారు.
* అంతా పార్టీ మనుషులతోనే..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో ఓ 40 మంది సలహాదారుల నియామకం జరిగింది. పార్టీకి పనికి వచ్చారని.. పార్టీకి పనికొస్తారని.. సామాజిక వర్గం వారని.. ఇలా అన్ని అంశాలను.. సమీకరణలను పరిగణలోకి తీసుకుని సలహాదారులను నియమించేవారు. అసలు సాగునీటి వనరులు గురించి తెలియని వారు సాగునీటి శాఖ సలహాదారులుగా నియమితులయ్యారు. ఐటీ గురించి తెలియని వారు సైతం ఐటి సలహాదారులు అయ్యారు. చివరకు సినిమా మనుషులను తెచ్చి మీడియా సలహాదారులుగా నియమించుకున్నారు. వారు సైతం సలహాదారులు కంటే రాజకీయ నాయకులం అన్నట్టు వ్యవహరించారు. ఏకంగా మీడియా సమావేశాలు నిర్వహించి నిత్యం రాజకీయ విమర్శలు చేసేవారు.
* గతానికి విరుద్ధం..
అయితే వైసిపి హయాంలో సలహాదారుల నియామకం అనేది ఒక నిత్య ప్రక్రియ గా సాగేది. ఫలానా సలహాదారుడు అంటూ సొంత పార్టీ శ్రేణులకు కూడా తెలియని చాలామంది ఉన్నారు. అయితే అటువంటి వ్యవస్థ ఉండకూడదని కూటమి ప్రభుత్వం తీర్మానించుకుంది. నిపుణులతో పాటు ఆయా రంగాల్లో ప్రముఖులను మాత్రమే సలహాదారులుగా నియమించుకోవాలని భావించింది. అందులో భాగంగానే ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు వంటివారికి క్యాబినెట్ హోదా తో కూడిన సలహాదారు పదవి ఇచ్చింది. అయితే ప్రభుత్వం నుంచి వచ్చే పారితోషికాలు, హోదాలు స్వీకరించలేదు చాగంటి. కానీ తనపై మోపిన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులకు నైతిక విలువలపై మెరుగైన సలహాలు అందించగలుగుతున్నారు. ఇప్పుడు ప్రముఖ ప్రకృతి వైద్యుడు మంతెన సత్యనారాయణ రాజు, కార్టూనిస్ట్ శ్రీధర్ కు సలహాదారు పదవిలో నియమించడం మాత్రం సహేతుకమే. ఎందుకంటే వీరు రాజకీయాలు చేయలేదు. రాజకీయాలు మాట్లాడలేదు. ఇకముందు మాట్లాడరు కూడా. అయితే ఏదో చక్కటి పరిణామంగా విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.