Homeఆంధ్రప్రదేశ్‌AP Economy 2025: ఏపీ ఎకానమీ మందగించిందా? వాస్తవమిదీ

AP Economy 2025: ఏపీ ఎకానమీ మందగించిందా? వాస్తవమిదీ

AP Economy 2025: పాలనలో ఒక్కొక్కరిది ఒక్కో విధానం. కొందరు అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించడం ద్వారా ఆర్థిక లావాదేవీలు పెరిగి ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలని చూస్తారు. మరికొందరు నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా నగదును అందించి.. వారిలో ఆర్థిక అభివృద్ధి పెంచాలని చూస్తారు. తద్వారా వారికి కొనుగోలు శక్తి పెరిగి పనుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని భావిస్తారు. అయితే ఇందులో మొదటి అంశాన్ని ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎంచుకున్నారు. రెండో మార్గాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. అయితే చంద్రబాబు ఆలోచనలు దూర దృష్టితో ఉంటాయి. భవిష్యత్తు తరాల ప్రయోజనాలు, వారికి ఉత్తమ ఉపాధితో పాటు ఉద్యోగాలు అందించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో భాగమే ఐటీ రంగం. అయితే ఇక జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను విపరీతంగా అమలు చేయడం ద్వారా ప్రజల్లో డబ్బు చలామని పెంచారు. తద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచారు. అయితే ఇంత చేసిన ఏపీలో ఆర్థికాభివృద్ధి పెరగకపోవడం, ప్రభుత్వ ఆదాయం జరగకపోవడం ఆందోళన కలిగించే విషయం.
 జగన్ తాజా ట్వీట్ 
 ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి కూడా ఏడాది అవుతోంది. అయితే 2025 – 26 ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసికంలో ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని జగన్ ఆరోపించారు. గణాంకాలతో సహా పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. అయితే జగన్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదికలతో సహా వెల్లడించడం విశేషం. ఇదేనా సంపద పెంచడం అంటూ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. దీంతో ఇది వైరల్ అంశంగా మారింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం లో.. రాష్ట్ర సొంత ఆదాయం కేవలం 3.47% మాత్రమే. కేంద్రం నుంచి వచ్చిన నిధులు అన్నీ కలిపి చూస్తే ప్రభుత్వ ఆదాయంలో మొత్తం 6.14% వృద్ధి మాత్రమే ఉంది. అదే సమయంలో రాష్ట్ర హక్కులు ఏకంగా 15.61 శాతం పెరగడం దారుణం. దీనిని ఉదహరిస్తూ చెప్పారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో సంపద సృష్టి, ఆదాయం పెంపొందించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
  బాగానే కష్టపడుతున్నా.. 
 అయితే కూటమి( Alliance ) పెద్దలు బాగానే కష్టపడుతున్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చేలా ఉన్నాయి. మరోవైపు పింఛన్ల లబ్ధిదారుల కు వెయ్యి రూపాయల పెంచి అందిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణం జరుగుతుంది. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. అయినా సరే ప్రభుత్వానికి నేరుగా ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడం ఏమిటి అనేది చర్చ. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు అప్పుల మీద ఆధారపడడం ఏమిటనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మిగులుతోంది. ఇంత పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి. పెట్టుబడులు వస్తున్నాయి. కానీ పనుల రూపంలో ఆదాయం పెరగడం ఏమిటి అనేది ఒక రకమైన ప్రశ్న.
 ఫలితాలు వచ్చేందుకు చాలా కాలం..
 అయితే చంద్రబాబు( CM Chandrababu) ఆలోచనలన్నీ భవిష్యత్తు తరాలను ఆలోచించుకొని ఉంటాయి. అయితే ఆ ఆలోచనల ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతుంది. 1995లో అధికారం చేపట్టారు చంద్రబాబు. అప్పటినుంచి 2004 వరకు ఐటీ పరిశ్రమలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. రసాయన రంగానికి ప్రోత్సాహం అందించారు. కానీ వాటి ఫలితాలు 2004 తర్వాత వచ్చాయి. అప్పటికే చంద్రబాబు అధికారానికి దూరమయ్యారు. రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. ఆ సమయంలో అనంతపురం జిల్లాకు కియో పరిశ్రమలను తెప్పించారు. కానీ ఆ పరిశ్రమ ఉత్పత్తులను ప్రారంభించింది 2019 తర్వాత. ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా అప్పటినుంచి ప్రారంభం అయింది. అంటే ముందు ప్రభుత్వాలు చేసిన ఫలితాలు తర్వాత ప్రభుత్వాలు అనుభవిస్తాయన్నమాట. అయితే ఈ విషయంలో చంద్రబాబు ముందు చూపు.. తరువాత ప్రభుత్వాలకు ఎంతో మేలు చేశాయి.
  అన్నీ సన్నాహాల్లోనే 
 ప్రస్తుతం రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుండడం వాస్తవం. ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం వస్తుండడం నిజం. అమరావతిలో( Amaravathi ) క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయడం కూడా అంతే వాస్తవం. అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కావడం కూడా నిజం. అయితే ఇవి సన్నాహాల్లో మాత్రమే ఉన్నాయి. ఇంకా పూర్తిస్థాయిలో పనులు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన మరుక్షణం నుంచి పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుంది. నిర్మాణ రంగంలో ఉత్పత్తులపై వచ్చే పన్నులు పెరుగుతాయి. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు సీఎం చంద్రబాబు. అక్కడ స్థిరపడిన చాలామంది ప్రవాస ఆంధ్రులు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. అయితే అలా ఒప్పుకున్న వెంటనే ఏపీ ప్రభుత్వానికి ఆదాయం పెరగదు. పెట్టుబడులు పెట్టి ఉత్పత్తులు ప్రారంభించిన తర్వాతే ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది. అయితే ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి మరింతగా ముందుకు కదలక పోవడానికి ఆదాయం సమకూరకపోవడమే కారణం. కానీ జగన్మోహన్ రెడ్డి సైతం అభివృద్ధి పనులు చేపట్టలేదు. పరిశ్రమలను తెప్పించలేదు. కానీ ముందు ప్రభుత్వం చేసిన పనులు ఫలితాలు.. తరువాత ప్రభుత్వంగా జగన్ దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. జగన్ సర్కార్ చర్యలు పుణ్యమా అని ప్రస్తుత ప్రభుత్వానికి ఆదాయం తగ్గినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular