Andhra Jyothi Daily News Paper :సాక్షి జగన్ డప్పు కొడుతుంది. నమస్తే కెసిఆర్ పల్లకి మోస్తుంది. ఈనాడు న్యూట్రల్ ముసుగు వేసుకొని పసుపు రంగు పూసుకుంటుంది. కానీ ఆంధ్రజ్యోతి వీటన్నిటికంటే భిన్నం. అవసరమైన రోజు పసుపు రంగు పూసుకొని పోతురాజు లాగా ఎగురుతుంది. అదే ఏదైనా తేడా కొడితే ఏదో ఒక సంచలన కథనాన్ని ప్రచురిస్తుంది. సోమవారం ఏపీ ఎడిషన్ లో జరిగింది ఇదే. “ఉచిత ఇసుక.. ధరల మరక” అనే పేరుతో బ్యానర్ కథనాన్ని అచ్చేసింది. బహుశా నెట్వర్క్ స్టోరీ అనుకుంటా.. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉచిత ఇసుక రవాణాకు ఇటీవల శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో లాగా ఇసుకను అడ్డగోలు రేట్లు అమ్మేది లేదని.. ప్రజలకు ఉచితంగా ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. “ఈ పథకం ఉద్దేశం ఉత్తమం అయినప్పటికీ.. ఆచరణ మాత్రం బాలారిష్టాలతో కొట్టుమిట్టాడుతోందని” ఆంధ్ర జ్యోతి రాసింది. “సామాన్యులకు ఇసుక భారంగా ఉందని.. ఉచిత విధానంతో ఉపశమనం దక్కలేదని.. జనానికి ఉత్తమ పథకం ప్రయోజనం చేరలేదని.. నిర్వహణ చార్జీల గండం ఇబ్బందిగా ఉందని.. జీఎస్టీ వేయడం సరికాదని.. రవాణా చార్జీలలో వ్యత్యాసం వల్ల భారం పడుతోందని.. అమలులో లోపాల దిద్దుబాటు తక్షణం జరగాలని” ఆంధ్రజ్యోతి రాస్కొచ్చింది.. వాస్తవానికి చంద్రబాబు అనుకూల పత్రిక ముద్రపడ్డ ఆంధ్రజ్యోతి ఇలాంటి కథనం రాయడం గొప్ప విషయమే. పైగా జనాల ఇబ్బంది కోణంలో ఈ వార్తను ప్రజంట్ చేసిన విధానం కూడా బాగుంది. కానీ ఇక్కడే ఆంధ్రజ్యోతి తన అసలు రూపాన్ని ప్రదర్శించింది.. ఇక్కడ ప్రభుత్వం తప్పేమీ లేదని.. కేవలం అధికారులు మాత్రమే ఇలా చేస్తున్నారని.. నెపం మొత్తం వారిపై వేసింది.
సమస్య తెలిసినప్పటికీ..
“జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుకను అడ్డగోలుగా తవ్వుకున్నారు. ఇందులో అందరూ వాటాలు పంచుకున్నారు. తాడేపల్లి ప్యాలస్ నుంచి మామూలు నాయకుడి వరకు అడ్డగోలుగా దోచుకున్నారు. కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. పేదలకు అందుబాటులో ఇసుక వచ్చింది. కానీ ఇక్కడ ఏకరూపత ఉండడం లేదు. ఇసుక రవాణా, నిర్వహణ, చార్జీల వసూలులో ఏకరూపత లేదు. వర్షాకాలం కావడంతో ఇసుక రీచ్ లు అందుబాటులో లేవు.. తగినంత స్టాక్ లేదు. దీనివల్ల ప్రజలకు ఇసుక లభించడం లేదని” ఆంధ్రజ్యోతి రాసింది. ఇందులో సమస్య గురించి ప్రస్తావించినప్పుడు.. అందులో ఉన్న అవాంతరాల గురించి వెల్లడించినప్పుడు.. అక్కడ అధికారులను బద్నాం చేయడం దేనికి. నాడు వెంకటరెడ్డి వైసీపీ పెద్దలు చెప్పినట్టు విన్నాడు కాబట్టి ఇసుక అనేది అందని వస్తువుగా మారిపోయింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో గనుల శాఖ అధికారులు మారారు.. ప్రభుత్వం తమకు అనుకూలమైన అధికారులను నియమించుకుంది. అలాంటప్పుడు వారు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు మాత్రమే ఉంటారు. అంత తప్ప వారి సొంత నిర్ణయాలు ఎలా ఉంటాయి? ఒకవేళ అలాంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రభుత్వ పెద్దల మద్దతు లేకుండా ఎలా అమలు అవుతాయి? ఈ చిన్న లాజిక్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విస్మరించాడు. బాబుకు ఇబ్బంది కలగకుండా.. అధికారులు మాత్రమే తప్పులు చేస్తున్నారని రాసుకొచ్చాడు. ఇసుక విధానంపై గత కొద్దిరోజులుగా సాక్షి కథనాల మీద కథనాలు ప్రచురిస్తోంది. దీనికి కౌంటర్ గానే ఆంధ్రజ్యోతి ఈరోజు ఏపీ ఎడిషన్ లో “ఉచిత ఇసుక ధరల మరక” అనే శీర్షికన కథనాన్ని ప్రచురించినట్టు తెలుస్తోంది. అయితే వంటకం బాగానే ఉన్నప్పటికీ.. ఉప్పు లేకుండా పోయింది. ఫలితంగా శుచి రుచి లేకుండా చప్పిడి వంటకంగా మారిపోయింది!