Takkalpalli Ravinder Rao Vs Andhra Jyothi: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో మీడియా సంస్థలు ఉన్నాయి. అందులో ఆంధ్రజ్యోతి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హాట్ హాట్ వార్తలను ప్రసారం చేయడంలో ఆంధ్రజ్యోతిది మొదటి నుంచి కూడా అందె వేసిన చెయ్యి. ఆ పత్రిక అధిపతి వేమూరి రాధాకృష్ణ స్వయంగా పాత్రికేయుడు కావడం.. ఆయనకు విస్తృతమైన పరిచయాలు ఉండడం వల్ల ఆ పత్రికలో, చానల్లో వేడివేడి స్టోరీలు పబ్లిష్ అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో విపరీతమైన చర్చకు దారితీస్తుంటాయి.
ఆంధ్రజ్యోతి పత్రికతో పాటు అనుబంధంగా ఏబీఎన్ ఛానల్ కూడా కొనసాగుతోంది. ఇటీవల ఏబీఎన్ ఛానల్ లో ఓ డిబేట్ నిర్వహిస్తున్నప్పుడు. . భారత రాష్ట్ర సమితి కీలక నాయకుడు తక్కెళ్ళపల్లి రవీందర్ రావు అందులో పాల్గొన్నారు. డిబేట్లో భాగంగా నడుస్తున్న చర్చ లో సమయమనం కోల్పోయారు. ఆగ్రహంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పటిదాకా ఆయన మాటలు విన్న ఏబీఎన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ ఒక్కసారిగా గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అంటూ తక్కల్లపల్లి రవీందర్ రావు ను ఎగ్జిట్ చేశారు.
ఈ పరిణామంపై భారత రాష్ట్ర సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు తమ అధికారిక కార్యక్రమాలకు ఏబీఎన్ ఛానల్ కు ఆహ్వానం లేదని స్పష్టం చేసింది. ఆ తర్వాత దీనిపై అటు గులాబీ పార్టీ.. ఇటు ఏబీఎన్ పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. గులాబీ పార్టీ సోషల్ మీడియాకు కౌంటర్ ఇచ్చే విధంగా ఏబీఎన్ కూడా రకరకాల వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికను కీర్తిస్తూ కెసిఆర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన క్లిప్పింగ్స్ ను ఏబీఎన్ ప్రసారం చేసింది.
ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే ఏబీఎన్ ఒక సంచలన వీడియోను విడుదల చేసింది. “ఏబీఎన్ నిర్వహించిన ఇటీవలి డిబేట్ లో కొంత మేర వివాదం చోటుచేసుకుంది. జరిగిన ఘటనకు చింతిస్తున్నాం. ఈ పరిణామం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. రవీందర్రావు పాత్రికేయులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా.. విచారం వ్యక్తం చేస్తారా..” అంటూ ఏబీఎన్ ఒక వీడియోను విడుదల చేసింది. ఏబీఎన్ ఇలా క్షమాపణ చెప్పడం.. ఇలా విచారం వ్యక్తం చేయడం గతంలో ఎన్నడూ లేదని పాత్రికేయులు అంటున్నారు. ఏదో బలమైన ఒత్తిడి రావడం వల్ల ఏబీఎన్ విచారం వ్యక్తం చేసిందని సీనియర్ పాత్రికేయులు చెబుతున్నారు.