Andhra Jyothi And Sakshi: ఆంధ్రజ్యోతి మాదిరిగానే సాక్షి పత్రిక ఎడిటర్ మార్పు కూడా ఉండబోతుందట. సాక్షి పత్రికకు ప్రస్తుతం వర్దెల్లి మురళి ఎడిటర్ గా కొనసాగుతున్నారు. ఆయనకు సజ్జల రామకృష్ణారెడ్డి మనిషి అని పేరుంది. సాక్షి పత్రిక ఏర్పాటు నుంచి మురళి కీలక పాత్ర పోషించారు. మొదట్లో పతంజలి ఎడిటర్ గా ఉన్నప్పటికీ.. సాక్షి వ్యవహారాలు మొత్తం మురళి పర్యవేక్షించేవారు. పతంజలి ఎడిటర్ గా ఉన్నప్పటికీ.. ఆయన పత్రికా స్టాటజీలో కొనసాగే వారు కాదు. ఆయన తన స్వేచ్ఛాయుత ఎడిటోరియల్ పాలసీని అనుసరించేవారు. కేవలం ఎడిట్ పేజీ మాత్రమే చూసుకునేవారు. తన వ్యాసాలను రాసుకునేవారు. ఆ తర్వాత అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. అనంతరం మురళికి ఎడిటర్ స్థానం లభించింది. మురళి ఎడిటర్ కావడం వెనక రామకృష్ణారెడ్డి కీలకపాత్ర పోషించారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. మురళి స్థలం నల్గొండ. మొదటి నుంచి సజ్జలకు మురళి నమ్మిన బంటుగా ఉండేవారు. మురళి గతంలో ఆంధ్రజ్యోతిలో పనిచేశారు. అప్పట్లో కే శ్రీనివాస్ (ప్రస్తుత ఆంధ్రజ్యోతి ఎడిటర్), మురళి, అల్లం నారాయణ, పెద్ద కృష్ణమూర్తి ఆంధ్రజ్యోతిలో అద్భుతాలు చేశారు. నాటి వైఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలను వండి వార్చారు. కొంతకాలానికి మురళి అందులో నుంచి బయటికి వచ్చారు. సజ్జలకు దగ్గరయ్యారు. పతంజలి మరణంతో సాక్షికి ఎడిటర్ అయ్యారు. ఎడిటర్ గా ఉన్నప్పటికీ సాక్షి అంతర్గత వ్యవహారాలలో మురళి వేలు పెట్టేవారు కాదట..
ఏపీలో అధికారం పోయిన తర్వాత..
ఏపీలో అధికారం పోయిన తర్వాత.. తప్పించాలని సాక్షి యాజమాన్యం నిర్ణయించింది. ఇటీవలే సజ్జల కూడా వైసిపి లో ఉన్న పోస్ట్ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఆయన తనయుడు సజ్జల భార్గవ్ ను కూడా సోషల్ మీడియా విభాగం నుంచి తప్పించారు. ఈ సంఘటనలు జరిగిన కొద్ది రోజులకు మురళి స్థానానికి ఎసరు వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయాం కాబట్టి.. వాడుకుని వదిలేశారు అనే అపప్రద రాకుండా ఉండడానికి.. గతంలో రామచంద్ర మూర్తిని నియమించినట్టుగా ఎడిటోరియల్ డైరెక్టర్ అనే పోస్ట్ ను మురళికి కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎడిటర్ గా ధనుంజయ రెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎడిటోరియల్ డైరెక్టర్ స్థానంలో మురళి చేయడానికి పెద్దగా ఏమీ ఉండదు. కాకపోతే గతంలో మాదిరిగానే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన రాయడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు శీర్షికన రాధాకృష్ణ ఎలాగూ జగన్ కు వ్యతిరేకంగా రాస్తాడు కాబట్టి.. మురళి దానికి కౌంటర్ గా సాక్షిలో రాస్తాడు. ఈ రెంటికి పెద్దగా తేడా ఉండదు కాబట్టి.. చర్చించాల్సిన అవసరం లేదు. ఇక ధనుంజయ రెడ్డి కూడా ఈనాడు కాంపౌండ్ లో పనిచేసిన వ్యక్తి. గతంలో సాక్షికి రెసిడెంట్ ఎడిటర్ గా పని చేశాడు. అప్పట్లో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో సాక్షి నుంచి పక్కనపెట్టి ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది కాబట్టి మళ్ళీ సాక్షిలోకి తీసుకొస్తున్నారు. ధనుంజయ్ రెడ్డికి ఎడిటర్ పోస్ట్ కేటాయించడంతో సాక్షిలోనే రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని తెలుస్తోంది.