Anti Drug Park in AP : ఏపీలో( Andhra Pradesh) మత్తుపదార్థాల కట్టడికి ప్రభుత్వం గట్టి చర్యలను ప్రారంభించింది. ఇప్పటికే గంజాయి, నల్ల మందు వంటి మత్తు పదార్థాలు ఏపీలో పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడుతున్న.. దాని మూలాలు ఏపీలో కనిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలోని మన్యప్రాంతంలో విస్తారంగా గంజాయి సాగు అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో యాంటీ డ్రగ్ పార్క్ ఏర్పాటు ఆలోచన తెరపైకి వచ్చింది. త్వరలోనే విశాఖలో యాంటీ డ్రగ్ పార్క్ ఏర్పాటు కానుంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. అదే జరిగితే ఏపీలో తొలి యాంటీ డ్రగ్ పార్కుగా విశాఖ గుర్తింపు సాధించనుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గంజాయితోపాటు మత్తుపదార్థాల నియంత్రణకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఏర్పాటు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈగల్ టీం ను రంగంలోకి దించింది. అందులో భాగంగానే ఇప్పుడు విశాఖలో యాంటీ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయనుంది.
* రెండు ఎకరాల స్థలంలో..
విశాఖలో ( Visakhapatnam) యాంటీ డ్రగ్ పార్కు కోసం రెండెకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ పార్కు ఏర్పాటు చేసేందుకు వీఎమ్ఆర్డిఏ టెండర్లు ఆహ్వానిస్తోంది. 15 రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జూన్ నెల కొరకు పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. డ్రగ్స్ కు బానిసైన యువతను ఉద్దేశించి ఈ యాంటీ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు వీఎమ్ఆర్డిఏ అధికారులు చెప్తున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మత్తుపదార్థాల వినియోగం, వాటి ప్రభావం పై యువతలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. యాంటీ డ్రగ్ పార్కులో స్వచ్ఛంద సంస్థలు తమ స్టాళ్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.
* మత్తు యువతకు కౌన్సిలింగ్..
డ్రగ్స్ కు బానిసైన యువతకు కౌన్సిలింగ్ ఇవ్వడమే ఈ యాంటీ డ్రగ్ పార్క్( anti-drug Park) ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ఎక్కువగా కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. విశాఖ సెంట్రల్ పార్క్ లో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ డ్రగ్ పార్క్ ఏర్పాటు కానుంది. రూ.3.5 కోట్లతో ఈ పార్కును నిర్మించనున్నారు. యువత డ్రగ్స్ కు ఎలా ప్రభావితం అవుతున్నారు? డ్రగ్స్ తో కలిగే దుష్ప్రభావాలు? మత్తు పదార్థాలకు బానిసగా మారితే జరిగే నష్టాలు? వంటి వాటిపై కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. జీవితం ఎంత రంగులు మయంగా ఉంటుందో వారికి చూపించేలా.. మొక్కలు, మెరిసే వస్తువులు, పచ్చదనంతో కూడిన ఆకృతులను ఈ యాంటీ డ్రగ్ పార్కులో తీర్చిదిద్దనున్నారు. ఈ పార్కు నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభించాలని వీఎమ్ఆర్డిఏ అధికారులు భావిస్తున్నారు.