Devineni Uma: ఏపీలో ఇప్పుడు అందరి దృష్టి కృష్ణాజిల్లా పై ఉంది. ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. 2014 నుంచి 2019 మధ్య కృష్ణాజిల్లా రాజకీయాలను శాసించారు దేవినేని ఉమా. మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆ సమయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆ కారణంగానే చాలామంది నేతలు నొచ్చుకున్నారు. అయినా సరే ఎనలేని ప్రాధాన్యం దక్కుతూ వచ్చింది. అప్పట్లో కీలకమైన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండేవారు ఉమా. గత ఐదేళ్ల కాలంగా వైసీపీ పై గట్టిగానే మాట్లాడేవారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై వీర విధేయత కనబరిచేవారు. అటువంటి నేతను ఎన్నికల్లో తప్పించారు చంద్రబాబు. మైలవరంలో వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కోసం సీటు త్యాగం చేశారు ఉమా. కానీ నామినేటెడ్ పోస్టులతో పాటు రాజ్యసభ పదవులను సైతం భర్తీ చేశారు. కానీ ఎక్కడ దేవినేని ఉమా పేరు వినిపించలేదు. అసలు ఆయనకు పదవి ఇచ్చే ఉద్దేశం ఉందా? ఇస్తారా? ఇవ్వరా? అన్న బలమైన చర్చ అయితే మాత్రం నడుస్తోంది.
* అంచలంచెలుగా ఎదుగుతూ
సోదరుడు దేవినేని రమణ అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఉమా. అంచలంచెలుగా ఎదిగి టిడిపిలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటే దేవినేని ఉమా.. ఉమా అంటే తెలుగుదేశం పార్టీ అనే స్థాయిలో బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అటువంటి నాయకుడు చేతిలో ఇప్పుడు ఏ పదవి లేకుండా పోయింది. ఆయన రాజకీయ ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. గత ఐదేళ్లలో పార్టీలో జరిగిన పరిణామాలు ఆయనకు మైనస్ గా మారాయి. ఉమా పై అధినేతకు మంచి అభిప్రాయం ఉన్నా.. క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి ఆయనకు తప్పించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.
* ఎమ్మెల్సీ పదవి ఆఫర్
2019 ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి రెండోసారి బరిలో దిగారు ఉమా. ఆయనపై వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ గెలిచారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికలకు ముందు వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరారు. ఈ నేపథ్యంలో పక్కకు తప్పుకోవాలని చంద్రబాబు సూచించడంతో మారు మాట ఆడకుండా దేవినేని ఉమా పక్కకు తప్పుకున్నారు. ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్ గెలుపు కోసం కృషి చేశారు. అయితే ఇంత చేసినా దేవినేని ఉమాకు ఇంతవరకు గుర్తింపు దక్కలేదు. అయితే ఉమాకు హై కమాండ్ నుంచి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న రాజ్యసభ పదవుల సమయంలో కూడా ఉమా పేరు పరిగణలోకి తీసుకున్నారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా వేరే నేతలకు ఆ అవకాశం దక్కింది. అయితే ఎమ్మెల్సీ పదవి మాత్రం ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఒకప్పుడు ఎమ్మెల్యేతో పాటు మంత్రిగా బాధ్యతలు చేపట్టి.. ఓ రేంజ్ లో తన హోదాను వెలగబెట్టారు. అటువంటిది ఇప్పుడు చేతిలో ఏ పదవి లేకపోయేసరికి.. రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ అవుతున్నారు ఉమా. మరి ఆయన విషయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.