Ambati Rambabu
Ambati Rambabu: వైసీపీలో భారీ స్థాయిలో ప్రక్షాళనకు దిగుతున్నారు వైయస్ జగన్. వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 80 చోట్ల అభ్యర్థులను మార్చారు. అయినా సరే ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. అయితే ఇప్పుడు కీలక నియోజకవర్గాల్లో సైతం ఇన్చార్జిలను మార్చుతున్నారు. ఈ నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ముఖ్యంగా సత్తెనపల్లి నియోజకవర్గ చుట్టూ నడుస్తున్న అంశం వివాదానికి దారితీస్తోంది. అక్కడ ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును తప్పిస్తారన్న ప్రచారం నడుస్తోంది. ఈ ఎన్నికల్లో అంబటి దారుణంగా ఓడిపోయారు. కన్నా లక్ష్మీనారాయణ చేతిలో 28 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఈ తరుణంలో అంబటి రాంబాబును సత్తెనపల్లి నుంచి తప్పిస్తారన్న ప్రచారం తెగ నడుస్తోంది. అయితే దీనిపై హాట్ కామెంట్స్ చేశారు అంబటి. తన నియోజకవర్గంలోకి ఎవరూ రావాల్సిన పనిలేదని.. తన నియోజకవర్గం ఎల్లలు కూడా తెలియని వారు ఇక్కడ ఏం రాజకీయం చేస్తారని అంబటి ప్రశ్నించారు. దీంతో నేరుగా అధినేత జగన్ ని టార్గెట్ చేసుకున్నారు. ఇప్పటివరకు జగన్ విషయంలో ఎప్పుడు నోరు తెరవని అంబటి.. ఇప్పుడు బహిరంగంగానే వ్యాఖ్యానించడం విశేషం.
* ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంట్రీ
సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి పోటీ చేయలేదు. ఆది నుంచి ఆయన మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో విజయం సాధించారు రామకృష్ణారెడ్డి. 2019లో మంత్రిగా ఉన్న లోకేష్ పై విజయం సాధించి సంచలనం రేకెత్తించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆళ్లను తప్పించారు జగన్. ఈ ఎన్నికల్లో బిసి అభ్యర్థిని ప్రకటించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి షాక్ ఇచ్చారు. కానీ ఈ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ 95 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అందుకే మంగళగిరిలో బలమైన బీసీ అభ్యర్థిని రంగంలోకి దించుతానని భావిస్తున్నారు. అయితే మరోసారి తనకు ఛాన్స్ దక్కుతుందని ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆశించారు. కానీ ఆయనను అనూహ్యంగా సత్తెనపల్లి వెళ్లాలని జగన్ ఆదేశించినట్లు సమాచారం.
* మార్పు ఖాయమా?
సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి అంబటి రాంబాబు మూడుసార్లు పోటీ చేశారు. ఒక్కసారి మాత్రమే గెలిచారు. కానీ అక్కడ అంబటి రాంబాబు పరిస్థితి అంతగా బాగాలేదు. ఆయనకు పార్టీ శ్రేణులతో సమన్వయం లేదు. అందుకే అభ్యర్థిని మార్చడానికి జగన్ నిర్ణయించారు. సత్తెనపల్లిలో కాపులతో పాటు రెడ్డి సామాజిక వర్గం అధికం. అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే కన్నా లక్ష్మీనారాయణ ను ఎదుర్కొనగలరని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అంబటి. తనను తెరవెనుక రాజకీయాలకే పరిమితం కావాలని జగన్ ఆదేశించడంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కానీ వీర విధేయ నేత కావడంతో ఎక్కడా బయటపడడం లేదు.