Ambati Rambabu Jail: ఏపీ సీఎం చంద్రబాబును( AP CM Chandrababu) దూషించిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టయ్యారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనకు అక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల కిందటి అంబటి అరెస్టు జరిగింది. కోర్టులో హాజరు పరిచిన తర్వాత 14 రోజులపాటు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అయితే అక్కడ ఆయనకు సాధారణంగా నిద్రపట్టే పరిస్థితి లేదని తెలుస్తోంది. నిద్రపోయేందుకు ఆయన ఓ ప్రత్యేక వైద్య పరికరాన్ని వాడుతున్నట్లు సమాచారం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పరికరం పైనే ఎక్కువగా ప్రచారం నడుస్తోంది. గతంలో ఇదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండేవారు చంద్రబాబు. ఆ సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు సైతం ఆవేదనతో ఉండేవారు. అయితే అప్పట్లో కొడాలి నాని వంటి వారు దీనిపై సెటైరికల్ గా మాట్లాడారు. జైలులో దోమలు కుడుతున్నాయి అంటే.. దోమలు కాకపోతే రంభ, ఊర్వశిలు వస్తారా అంటూ అప్పట్లో కొడాలి నాని చేసిన కామెంట్స్ వైసీపీ కొంప ముంచాయి. అయితే ఎంతటి వారైనా వారు మనుషులే కదా? వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా? ఇప్పుడు అంబటి విషయంలోనూ అదే జరిగింది. అందుకే ప్రత్యేక పరికరం వాడాల్సి వస్తోంది.
* అనారోగ్య సమస్యలతో..
అంబటి రాంబాబు( ambati Rambabu) పైకి దూకుడుగా ఉంటారు కానీ.. ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారట. ఆయనకు నిద్రలో సాధారణంగా ఒక్కోసారి శ్వాస ఆగిపోతుందట. అయితే తిరిగి దానంతట అదే మొదలవుతుందట. మధ్యలో గ్యాప్ పెరిగితే ప్రాణాలు కూడా ప్రమాదం అట. అందుకే డాక్టర్లు ఆయనకు ఎలాంటి సమస్యలు లేకుండా నిద్రలో కూడా పూర్తిస్థాయిలో శ్వాస ఆడేలా స్లీప్ అప్నియా అనే పరికరం వాడాలని సూచించారట. దీంతో ఆయన కొంతకాలంగా ఇంట్లో కూడా ఈ పరికరమే వాడుతున్నారట. అయితే తన సమస్యను కోర్టుకు రాంబాబు చెప్పుకున్నారు. నిద్రలో తనకు శ్వాస ఎప్పుడైనా ఆగిపోయే పరిస్థితి ఉన్నందున.. జైల్లో స్లీప్ అప్నియా పరికరం వాడేందుకు అనుమతి కోరారు. దీంతో కోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు రాజమండ్రి జైల్లో స్లీప్ అప్నియా పరికరం పెట్టుకుని నిద్రపోతున్నట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. అంబటి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నన్ని రోజులు ఆ పరికరాన్ని వాడుకునే వెసులుబాటు కల్పించింది కోర్టు.
* జగన్ పరామర్శ..
మరోవైపు ఈరోజు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పరామర్శించారు. అయితే ఇది పరామర్శలా లేదు. బల ప్రదర్శన మాదిరిగా ఉంది. భారీ కాన్వాయ్ నడుమ జగన్మోహన్ రెడ్డి గుంటూరు వెళ్లారు. దారి పొడవునా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలు చల్లుతూ ఆహ్వానం పలికాయి. అయితే అంబటి రాంబాబు అరెస్టు విషయంలో కాపు సామాజిక వర్గాన్ని తెరపైకి తెస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. కానీ అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. అయితే అంబటి వ్యాఖ్యలతో ఇంతటి వివాదం జరగగా.. అదే ఘటనతో వైసిపి రాజకీయం చేయాలని చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 14 రోజులపాటు కోర్టు రిమాండ్ విధించింది. మరోవైపు బెయిల్ కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం ప్రయత్నాల్లో ఉంది. అయితే అప్పటివరకు జైల్లో అంబటి రాంబాబు ఆ పరికరం వాడక తప్పని పరిస్థితి.