Amaravati Agitation : అమరావతి ఉద్యమం ఏపీలో మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని చూరగొంది. అయితే అది నిన్నటి వరకూ మాత్రమే. కానీ ఇప్పుడు ఉద్యమం అసలు బాగోతం బయటపడింది. అమరావతి అంటే అంధ్రులదని.. దానికి సుదీర్ఘ చరిత్ర ఉందని.. సమాజంలో అన్నివర్గాల మిళితమని మేథావులు, ఉద్యమకారులు చెప్పుకొచ్చారు. కానీ ఈ రోజుతో అదంతా ఫేక్ అని తేలిపోయింది. అందరి భాగస్వామ్యంతో ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లిన రైతులు తమ ముసుగును తీసేశారు. రాజధాని అంటే పెత్తందార్లది మాత్రమేనని.. ఇక్కడ పేదలు, బడుగు, బలహీనవర్గాలకు చోటులేదని బహిరంగంగా ప్రకటించేశారు. వైసీపీ ఆడిన గేమ్ లో సమిధులుగా మారిపోయారు. ఇప్పుడు పేదల వ్యతిరేకిగా మారిపోయారు.
వైసీపీ మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినప్పుడు ఏపీలో మెజార్టీ ప్రజలు అమరావతి రైతులపై జాలితో చూశారు. రాజకీయాలకు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా నిలవకపోయినా వారి న్యాయబద్ధమైన పోరాటానికి సంఘీభావం తెలిపారు. బహిరంగ నిరసన తెలపకపోయినా లోలోపల మాత్రం మద్దతు పలికారు. వారిపై ఉక్కుపాదం మోపినప్పుడు విలవిల్లాడిపోయారు. అయితే ఇన్నాళ్లూ తమ ఉద్యమానికి పేదలు, బడుగు, బలహీనవర్గాలే మద్దతు తెలిపారన్న కనీస అవగాహన మరచిపోయారు. రాజకీయ ఉత్సుకతతో వైసీపీ పేదలకు స్థలాలు ఇస్తున్న విషయాన్ని గ్రహించలేకపోయారు. పేదలకు తమ స్థలాలు ఇస్తున్నందున ఆహ్వానించాల్సింది పోయి..మా దగ్గర మీరు ఉంటానికి వీళ్లేదని… మేము పెత్తందార్లం అని అర్ధం వచ్చేలా మాట్లాడారు.
ఇప్పటివరకు రాజధాని సెంటిమెంట్‌ను రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు అర్ధం చేసుకున్నారు. బహిరంగంగా మద్దతు తెలిపారు. కానీ ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనే సాహసం చేయలేదు. రాజధాని ప్రాంతంలో ఏదో ఉద్దేశ్యంతో జగన్ సర్కారు కొంత మంది నిరుపేదలకు భూములు పంచుతుంటే.. తమలో అక్కసు అనుచుకులేనంత బలహీనత ప్రత్యర్థులకు బలంగా మారింది. రాజధానిలో పేదలకు ఏ విధంగా భూములు ఇస్తారని.. ఇది తమ సామంత రాజ్యమని.. తుళ్లూరులో ఇవాళ రైతులు నిరసన తెలిపారు. అంతేకాకుండా.. నల్లబెలూన్లు ఎగురవేసి ఆక్రోశాన్ని వెల్లగక్కారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తేనే రాజధాని ప్రాంతం రైతులు ఇలా ప్రవర్తిస్తే.. ఇక పేదలు అక్కడ ఇళ్లు నిర్మించుకుంటే వారు ఏం చేస్తారో అని భయాందోళనలు సృష్టిస్తారని తెలియక రాజకీయ క్రీనీడలో చిక్కుకున్నారు. ఇన్నాళ్లూ కాపాడుకొస్తున్న ఉద్యమానికి చేజేతులా నష్టం చేసుకున్నారు.
అయితే ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇప్పటి నుంచి మరోలెక్క అన్న మాదిరిగా అమరావతి ఉద్యమం మరో టర్న్ తీసుకోనుంది. అక్కడ ఉండేది పెత్తందార్లే తప్ప.. తమలాంటి పేదలు లేరని ఆ వర్గం ఉద్యమం నుంచి తప్పుకునే అవకాశం ఉంది. వైసీపీ రాజకీయంగా నిర్ణయం తీసుకొని ఉంటే.. దానికి అదేస్థాయిలో బుద్ధి చెప్పాలే తప్ప.. మేం, మీరు ఒకటి కాదని రైతులు ఉద్యమించడం ద్వారా ఎటువంటి ఫలితం ఉండదు. సరిగ్గా ఏపీ సీఎం క్లాస్ వార్ అని ప్రకటించిన సమయంలో చేజేతులా ఆయుధం అందించిన అమరావతి రైతుల మూర్ఖత్వాన్ని ఏమనాలి. అమరావతి ప్రజా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సింది పోయి.. వర్గ వైషమ్యాల వ్యాఖ్యానాలతో తమకు తాము నష్టం చేయడానికి ఏమనుకోవాలి. అది ముమ్మాటికీ అమరావతి రైతుల వైఫల్యమే. అందుకు మూల్యం కూడా వారే చెల్లించుకోవాల్సిన అనివార్య పరిస్థితి.