Amaravati Eye Project: అమరావతి కేవలం ఏపీ రాజధాని మాత్రమే కాదు. ప్రపంచంలోనే మహానగరంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు సర్కార్ ప్రణాళిక. కేవలం పాలనాపరమైన పనుల మీద మాత్రమే ప్రజలు రాకూడదు. పర్యాటక రంగంగా కూడా అమరావతిని చూడాలన్నది ఒక ఆలోచన. ఉమ్మడి ఏపీలోనైనా.. ఇప్పుడైనా హైదరాబాదుకు వెళ్లేవారు ఒక్క ప్రభుత్వ పని మీద కాదు. రకరకాల కారణాలతో వెళుతుంటారు. ముఖ్యంగా భాగ్యనగరంలో పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేకంగా వెళ్లిన వారు కూడా ఉంటారు. అటువంటి పరిస్థితి అమరావతికి కల్పించాలన్నది చంద్రబాబు సర్కార్ ఆలోచన. బ్రిటన్ రాజధాని లండన్ లోని థేమ్స్ నది ఒడ్డుగా పర్యాటకులకు విశేషంగా ఆకర్షించే ప్రపంచ ప్రఖ్యాత లండన్ ఐ తరహాలోనే.. ఏపీ ప్రభుత్వం అమరావతి ఐ పేరుతో ఒక భారీ అబ్జర్వేషన్ వీల్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇటీవల మంత్రివర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. దీంట్లో ఈ ప్రతిష్టాత్మక టూరిజం ప్రాజెక్టుకు ఆమోదముద్ర పడింది.
కృష్ణా నదికి ఆభరణంగా..
అమరావతికి కృష్ణా నది ఆభరణం. నది ఫ్రంట్ లైన్ లో ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోని సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత వైభవంగా అమరావతి ఐ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ భారీ వినోద కేంద్రాన్ని డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో.. నిర్మించేందుకు ప్రైవేటు భాగస్వామ్యుల నుంచి కాంపిటేటివ్ టెండర్లు, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ ఆహ్వానించేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ, నిర్వహణ సంస్థకు 30 సంవత్సరాల పాటు లీజు వ్యవధిని ప్రభుత్వం ఖరారు చేసింది.
* కృష్ణా నది ఒడ్డున నిర్మితంకానున్న ఈ ప్రాజెక్టులో అన్ని ప్రత్యేకమే. ఒక భారీ అబ్జర్వేషన్ వీల్ ఉంటుంది. ఇందులో సురక్షితమైన, అత్యాధునిక గ్లాస్ క్యాప్సూల్స్ ఉంటాయి. ఈ చక్రం చాలా నెమ్మదిగా, నిరంతరం తిరుగుతూ ఉంటుంది. పర్యాటకులు ఈ క్యాబిన్ లలో కూర్చుని.. ఆకాశమార్గంలోకి పైకి వెళ్లే కొద్ది.. కింద ప్రవహించే కృష్ణానది సుందర దృశ్యాలు, పచ్చని ప్రకృతి పరిసరాలు, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరాన్ని 360 డిగ్రీల కోణంలో చూడవచ్చు.
* లండన్ వెళ్లేవారు తప్పకుండా లండన్ ఐ ని చూసి వస్తారు. అందుకే ఏపీకి వచ్చే పర్యాటకులకు కూడా ఆ మధురానుభూతి అందించేందుకు అమరావతి ఐ నీ ఒక ల్యాండ్ మార్క్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
* కేవలం పర్యాటకంగానే కాదు .. ఈ ప్రాజెక్టుతో పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా పుంజుకుంటుంది. పర్యాటకంగా ఈ ప్రాంతం గ్లోబల్ హబ్ గా మారుతుంది.
