Amaravati election strategy: ఏపీ ( Andhra Pradesh) రాజకీయాలు ఇప్పుడు అమరావతి చుట్టూ తిరుగుతున్నాయి. అమరావతికి చట్టబద్ధత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. పనులు శరవేగంగా జరిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. ఇప్పటికే మూడు రాజధానుల అంశంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ డామేజ్ జరిగింది. అది కాదన్నట్టు ఇప్పుడు కొత్త ప్రతిపాదన తీసుకురావడం సొంత పార్టీ శ్రేణులకు కూడా నచ్చడం లేదు. జగన్మోహన్ రెడ్డి కూటమి ట్రాప్ లో పడినట్లు వారు భావిస్తున్నారు. అమరావతి అంశాన్ని 2029 ఎన్నికల వరకు సజీవంగా తీసుకెళ్లడానికి కూటమి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అమరావతి అనే అంశంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని భారీ ప్లాన్ రూపొందించింది. అయితే జగన్మోహన్ రెడ్డి తెలిసి చేశారో.. తెలియక చేసారో తెలియదు కానీ.. మావిగన్ ప్రతిపాదనతో అడ్డంగా బుక్కయ్యారు.
విజయానికి అదే కారణం
గత ఎన్నికల్లో అమరావతి రాజధాని( Amravati capital ) అనే అంశం కూటమిని అధికారంలోకి తెచ్చి పెట్టింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కూడా అమరావతి అంశమే కారణం. అయితే అమరావతి విషయంలో వెనక్కి తగ్గితే రాజకీయంగా ఇంకా డామేజ్ తప్పదని జగన్మోహన్ రెడ్డి భావించినట్టు ఉన్నారు. అలాగని మూడు రాజధానులే తమ అభిప్రాయమని చెప్పలేకపోతున్నారు నేరుగా. ఎందుకంటే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నారు 2024 ఎన్నికలకు ముందు. న్యాయస్థానాల్లో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని తెలిసి తాము వెనక్కి తీసుకున్నట్లు అప్పట్లో ప్రకటించారు. అటు అమరావతిని సమర్థించలేక.. ఫెయిల్యూర్ అంశమైన మూడు రాజధానులతో ముందుకు వెళ్ళలేక.. మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు ధర్మసందేహంలో పడిపోయారు. అనవసరంగా వ్యాఖ్యానించి ప్రతిపాదించారని సొంత పార్టీ శ్రేణులే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
మళ్లీ ప్రచార అస్త్రంగా..
2029 ఎన్నికల్లో సైతం అమరావతిని ప్రచార అస్త్రంగా వాడుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులను పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాల్లో ఉంది. అవి పూర్తి చేసిన తర్వాత అమరావతికి జగన్ వ్యతిరేకం అన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. మరోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతిని నిర్వీర్యం చేస్తారని ఆరోపించే అవకాశం ఉంది. దీనికి గాను మావిగన్ పేరుతో ఇప్పటికే అస్త్రం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే మరోసారి రాజధానిని మార్చేస్తారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రతిపాదన కంటే అమరావతిలో అవినీతిపై దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. అయితే 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమరావతిని పూర్తి చేసి ప్రజలకు కానుకగా ఇవ్వాలనుకుంది కూటమి. తద్వారా ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని చెప్పే ప్రయత్నం చేయాలని భావించింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చి మరో అస్త్రం ఇచ్చారు కూటమి చేతిలోకి..