Amaravati Drone Summit: 5500 డ్రోన్లు.. అమరావతిలో ఆకాశమే చిన్నబోయింది.. చంద్రబాబు చేతిలో 5 ప్రపంచ రికార్డులు పెట్టేసింది

జాతీయస్థాయిలో ఏపీ మరోసారి చర్చకు దారితీసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించింది. ఇప్పుడు డ్రోన్ సమ్మిట్ ను ఏర్పాటు చేసి.. దేశాన్ని తన వైపు చూసేలా చేసింది.

Written By: Dharma, Updated On : October 23, 2024 9:32 am

Amaravati Drone Summit

Follow us on

Amaravati Drone Summit: డ్రోన్ షో అదరహో అనిపించింది. అట్టహాసంగా జరిగింది. డ్రోన్ సమ్మిట్ -2024లో భాగంగా.. అమరావతిలో నిర్వహించిన ఈ డ్రోన్ షో వీక్షకులను ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా వీక్షకులను ఆకర్షించింది. పలు ప్రపంచ రికార్డులను సైతం సొంతం చేసుకుంది. మొత్తం ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. విజయవాడలోని పున్నమి ఘాట్లో జరిగిన ఈ డ్రోన్ షోను సీఎం చంద్రబాబు తో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ డ్రోన్ షోలో డ్రోన్ల ద్వారా పలు ఆకృతులను సృష్టించారు. విమానం, జాతీయ జెండా, బుద్ధుడి ఆకృతులను డ్రోన్ల ద్వారా రూపొందించారు. లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్, లార్జెస్ట్ ల్యాండ్ మార్క్, లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్, అలాగే డ్రోన్ల ద్వారా అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ, ఏరియల్ లోగో తో ఐదు ప్రపంచ రికార్డులు నమోదు కావడం విశేషం. దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో గా ఇది నిలిచింది. దేశవ్యాప్తంగా ఇది ఆకట్టుకుంది. మరోసారి ఏపీ గురించి బలంగా చర్చి నడిచింది.

* అన్ని ప్రత్యేకతలే
అయితే ఈ డ్రోన్ షోలో అన్ని ప్రత్యేకతలే. తొలిసారి 5500 డ్రోన్లతో ఈ సోను ఏర్పాటు చేశారు. షోను చూసేందుకు వీక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో కృష్ణ తీరం జనసంద్రంగా మారింది. అయితే జనాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ నగరంలో ఐదు ప్రాంతాల్లో ప్రత్యేక డిస్ప్లేలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా డ్రోన్ షో తో పాటుగా లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేశారు. రెండు రోజులపాటు ఈ డ్రోన్ షో కొనసాగుతోంది. అందులో భాగంగా సమ్మిట్ సైతం నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో భాగంగా ప్యానెల్ డిస్కషన్లు, డ్రోన్ల ప్రదర్శన ఉంటుంది.

* ఐదు ప్రపంచ రికార్డులు సొంతం
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా టిడిపికి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. కేంద్రంలో టిడిపికి రెండు మంత్రి పదవులు దక్కాయి. అందులో భాగంగా రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ పౌర విమానయాన శాఖను అప్పగించారు. ఇప్పటికే రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. మరోవైపు అమరావతిలో డ్రోన్ సమ్మిట్ జరగడం వెనుక రామ్మోహన్ నాయుడు పాత్ర ఉంది. అయితే తొలి రోజు ఈ షో సక్సెస్ అయ్యింది. ఐదు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. ఈ ప్రపంచ రికార్డులకు సంబంధించిన ధ్రుపత్రాలను గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందించారు. మొత్తానికి అయితే ఈ షో తొలి రోజు విజయవంతం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.