YCP: అనంతపురం జిల్లాలో( Ananthapuram district ) రాజకీయాలు మారుతున్నాయి. ముఖ్యంగా చాలామంది నేతలు పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు. అయితే రాయలసీమలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం డోకా లేదు. అక్కడ బలమైన నాయకులే ఆ పార్టీకి ఉన్నారు. అయితే విభేదాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి చాలా నియోజకవర్గాల్లో. ప్రస్తుతానికైతే చాలామంది నేతలు స్తబ్దుగా ఉన్నారు. కచ్చితంగా 2029 ఎన్నికల నాటికి యాక్టివ్ అవుతారు. అయితే ఇప్పుడు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తెరపైకి వచ్చారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రకటించారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ అని ప్రకటించుకున్నారు. దీంతో అదే నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జికు షాక్ తప్పలేదు. గత రెండుసార్లు పార్టీ కోసం పనిచేసిన తనను పక్కన పెడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరిస్తున్నట్లు సమాచారం. అయితే ఉన్నట్టుండి గురునాథరెడ్డి ఇలా ప్రకటన చేయడం ఏంటి అనేది ఒక ప్రశ్న.
* టిడిపికి పట్టున్న జిల్లా
రాయలసీమ ( Rayalaseema ) ప్రాంతం ఒక ఎత్తు.. అనంతపురం జిల్లా ఒక్క ఎత్తు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పట్టు ఎక్కువ. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ లో ఆ పార్టీకి బలం ఉంది. ముఖ్యంగా బీసీల్లో ఎక్కువమంది తెలుగుదేశం పార్టీని ఇష్టపడతారు. అయితే రాజశేఖర్ రెడ్డి ఆ విషయాన్ని గుర్తించి బలమైన అభ్యర్థులను బరిలోదించేవారు. అలా 2009లో అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి గురునాథరెడ్డిని బరిలో దించారు రాజశేఖర్ రెడ్డి. ఆ ఎన్నికల్లో గురునాథ్ రెడ్డి ఘనవిజయం సాధించారు. అయితే రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన పై ఇష్టంతో జగన్ వెంట అడుగులు వేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012లో ఉప ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో మాత్రం మూడోసారి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో కొనసాగుతూ వచ్చారు. 2017లో టిడిపిలో చేరారు. అక్కడకు కొద్ది రోజులకే మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత రెండుసార్లు ఆయనకు టికెట్ లభించలేదు.
* కీలక ప్రకటన..
అయితే ఇప్పుడు అదే గుర్నాథ్ రెడ్డి( Gurunath Reddy) పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని ప్రకటించారు. అయితే ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో గురునాథరెడ్డి అలా ప్రకటన చేసేసరికి పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. అయితే వైసీపీలో పెద్ద నాయకుల హస్తం లేకుండా ఆయన ఆ ప్రకటన చేయరు. కానీ వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానని చెప్పడం ద్వారా సరికొత్త సమీకరణలకు తెరతీశారు. అయితే ఒక్క అనంతపురం అర్బన్ నియోజకవర్గం కాదు.. చాలా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వం తెరపైకి వస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక రకమైన కలవరమే. జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ ఇవ్వకపోయినా గత రెండుసార్లు వైసీపీలోనే కొనసాగుతూ పార్టీ విజయానికి కృషి చేశారు గురునాథరెడ్డి. అటువంటి వ్యక్తి ఇప్పుడు టిక్కెట్ కావాలని సంకేతాలు ఇస్తున్నారు. పార్టీలో ఇటువంటి స్వరాలు పెరిగే అవకాశం ఉంది. మున్ముందు జగన్మోహన్ రెడ్డికి ఇది ఇబ్బందికరమే. దీని నుంచి ఆయన ఎలా అధిగమిస్తారో చూడాలి.