Homeఆంధ్రప్రదేశ్‌AP Politics: ఏపీలో ఇదే కీలకం

AP Politics: ఏపీలో ఇదే కీలకం

AP Politics: వచ్చే ఎన్నికలు అత్యంత ఖరీదైనవి గా మారనున్నాయి. టికెట్ల కేటాయింపులో రాజకీయ పార్టీలన్నీ ధనమున్నవారికి ప్రాధాన్యమిచ్చాయి. ఆర్థికంగా బలమైన అభ్యర్థులకు పెద్దపీట వేశాయి. ఇప్పటికే వైసీపీ 11 జాబితాలను ప్రకటించింది. దాదాపు అభ్యర్థులను ఖరారు చేసింది. తెలుగుదేశం, జనసేన 99 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశాయి. బిజెపితో కలిసి రెండో జాబితా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే ఈ నాలుగు పార్టీలు ఆర్థికంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి టిక్కెట్లు ఇస్తుండడం విశేషం. దీంతో ఈ ఎన్నికలు అత్యంత ఖరీదైనవి గా మారనున్నాయి. దాదాపు 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు ఖర్చు కానున్నాయి.

వైసీపీలో దాదాపు 70 నుంచి 80 మంది సిట్టింగులకు టికెట్లు దక్కాయి. టిడిపిలో సైతం మాజీ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేశారు. అటు జనసేన, బిజెపిలో సైతం రాజకీయ చరిష్మ ఉన్న నాయకులే టిక్కెట్లు దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఒకటి మాత్రం వాస్తవం. దాదాపు రాజకీయాల్లో ఉన్నవారే పోటీకి ఆసక్తి చూపుతున్నారు. పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల్లో అభివృద్ధి చెందిన వారు రాజకీయాల్లోకి వస్తున్నారు. టిక్కెట్లు దక్కించుకుంటున్నారు. కోస్తాంధ్రలో ఖర్చు ఒకలా ఉంటుంది. రాయలసీమలో మరోలా ఉంటుంది. ఉత్తరాంధ్రలో స్వల్పంగా ఉంటుంది. కృష్ణా, గుంటూరు వంటి జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్యే సీటుకు 50 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గోదావరి జిల్లాలో సైతం అదే దూకుడు ఉంటుంది. రాయలసీమ గురించి చెప్పనవసరం లేదు. ఉత్తరాంధ్రలో మాత్రం 20 నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 175 నియోజకవర్గాలను తీసుకుంటే ఒక్క అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వేల కోట్ల రూపాయలకు దాటుతోంది. అయితే ఎన్నికల వ్యయాన్ని భరించిన వారికే పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి.

అయితే ఇలా గెలిచినవారు సంపాదనకు ప్రాధాన్యమిస్తారు. అదో వ్యాపార ధోరణి కూడా. ఎన్నికల్లో 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే.. దానికి మించి ఆశిస్తారు. ల్యాండ్, శాండ్, మద్యం, మైనింగ్.. ఇలా ఒకటేమిటి అన్ని రకాలుగా ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ఓటు వేయడానికి ప్రజలు నగదు తీసుకుంటే.. అదే నగదు సంపాదించుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు కచ్చితంగా అక్రమ బాట పడతారు. దీనికి ముమ్మాటికి కారణం ఎన్నికల ఖర్చు. ఎన్నికల్లో ఖర్చు చేయాలి, చేసిన ఖర్చు రాబెట్టుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న తంతు ఇదే. దీనిని మార్చాలంటే ముందుగా ప్రజల్లో మార్పు రావాలి. రాజకీయ పార్టీలు తమ పంధాను మార్చుకోవాలి. ప్రజలు సిద్ధంగా ఉన్నారా? పార్టీలు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటాయా? అది ఈ దేశంలో సాధ్యమా? అంటే మౌనమే సమాధానమవుతోంది. డబ్బు లేనిదే ఎన్నికలు లేవు? డబ్బు లేనిదే వ్యవస్థ నడవడం లేదు. ఇటువంటి తరుణంలో డబ్బు లేని ఎన్నికలంటే ఎవరైనా చులకనగా చూస్తారు. ఈ వ్యవస్థ మారాలంటే ముందు ప్రజలు మారాలి. అప్పుడే మార్పు ఊహించగలం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version