Super Six-Super Hit: ఏపీలో( Andhra Pradesh) కూటమి సూపర్ సక్సెస్ అయ్యింది. మూడు పార్టీల కలయిక ప్రభంజనం సృష్టించింది. దేశంలో మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడానికి కారణమైంది. అందుకు అవసరమైన బలాన్ని ఏపీ అందించగలిగింది. 2014, 2019లో అధికారంలో వచ్చిన ఎన్డీఏ సొంత బలంతో నిలబడగలిగింది. దీంతో ఏపీ విషయంలో వేరే ఆలోచనతో ఉండేది కేంద్రం. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం మెజారిటీకి చాలా దూరంలో నిలిచిపోయింది ఎన్డీఏ. ఆ సమయంలో ఏపీలో కూటమికి వచ్చిన 21 పార్లమెంటు సీట్లు.. కేంద్రంలో బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డాయి. దీంతో ఏపీ విషయంలో సైతం కేంద్రం ఉదారంగా ఉండడం ప్రారంభించింది. ఏపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా బిజెపి చేరింది. ఇలా మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. దీంతో సంబరాలకు సిద్ధపడింది కూటమి. ఈ నెల 10న అనంతపురంలో ‘సూపర్ సిక్స్- సూపర్ హిట్’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజెపి నేతలు, కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నేతలు వచ్చే అవకాశం ఉంది.
వ్యూహం ప్రకారం కూటమి..
టిడిపి( Telugu Desam Party) నేతృత్వంలోని కూటమి ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తోంది. 2023 సెప్టెంబర్లో చంద్రబాబు అరెస్టయ్యారు. ఆ సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును కలుసుకున్నారు పవన్. బయటకు వచ్చి నేరుగా టిడిపి తో పొత్తు ఉంటుందని ప్రకటన చేశారు. బిజెపిని కొలుపుకెళ్తామని కూడా తేల్చి చెప్పారు. అది మొదలు ప్రారంభమైన కూటమి పార్టీల స్నేహం.. రోజురోజుకు అభివృద్ధి చెందుతుందే తప్ప.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టు పొత్తు విచ్చినం కావడం లేదు. క్షేత్రస్థాయిలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా.. నాయకత్వాలు మాత్రం సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. తామంతా కలిసి ఉన్నామని.. 2029 ఎన్నికల్లో కూడా ఈ కలయిక కొనసాగుతుందని.. మరో 15 సంవత్సరాల పాటు ఏపీకి ఈ కూటమి అవసరం అని నొక్కి చెబుతున్నారు. ప్రజలకు స్పష్టమైన సంకేతాలు పంపగలుగుతున్నారు.
ఇలాంటి ఎన్నో మాటలు..
‘ఎక్కడ పొత్తులే.. ఒకవేళ పొత్తు పెట్టుకున్నా ఎక్కువ కాలం కలిసి ఉండలేరులే.. సీట్ల సర్దుబాటు దగ్గర తేడా వస్తుందిలే.. మంత్రి పదవులు ఇవ్వకపోతే సీనియర్లు అసమ్మతి చాటుతారులే.. ఎన్ని రోజులు ఈ స్నేహం కొనసాగదులే’.. ఇలాంటి మాటలు ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూ వచ్చాయి. మూడు పార్టీల మధ్య ప్రచారం కూడా పతాక స్థాయికి చేరింది. అదిగో పులి అన్న కథ మాదిరిగా విడిపోతున్నారు అని చెప్పేందుకు వైసిపి చాలా రకాల ఆరాటాలు పడింది. మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.. సీట్లు సర్దుబాటు చేసుకున్నాయి.. మంత్రి పదవులు సరిపెట్టుకున్నాయి.. ఏడాదికి పైగా పాలనను కొనసాగించాయి.. కేంద్రం సైతం ఉదారంగా ఏపీకి సాయం చేస్తోంది.. గతానికి మించి అనలేని ప్రాధాన్యం దక్కుతోంది.. ఇలా అన్నింటా పొత్తు గౌరవమైన రీతిలో ముందుకు కొనసాగుతోంది. అందుకే ఉరకలేసే ఉత్సాహంతో రేపు అనంతపురంలో మూడు పార్టీల విజయోత్సవ సభ జరగనుంది. తద్వారా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా విడిపోము అంటూ సంకేతాలు ఇవ్వనున్నాయి టిడిపి, జనసేన, బిజెపి. ఆ మూడు పార్టీలు ఇచ్చే పిలుపు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా ఇబ్బందికరమే.