ఓ వైపు తౌక్తే తుఫాను బీభత్సం పూర్తిగా చల్లారక ముందే.. మరో తుఫానుకు రంగం సిద్ధమవుతోంది. బంగాళాఖాతంలో రాబోయే మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. క్రమంగా ఇది తుఫానుగా మారేందుకు అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం అందుకు వాతావరణం కూడా అనుకూలంగా ఉందని చెబుతున్నారు.
ఈ తుఫానుకు ‘యాస్’ అని పేరు పెట్టింది ఒమన్. తుఫానుగా ఇంకా రూపుదిద్దుకోలేదని, ఒకవేళ తుఫానుగా మారితే మాత్రం దాని తీవ్రత చాలా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతం ఉపరితల వాతావరణం వేడెక్కిందని ప్రకటించింది. ఇప్పుడు 31 డిగ్రీల సెల్సియస్ వాతావరణం ఉందని, ఇది సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువ అని అధికారులు చెబుతున్నారు. తుఫాను ఏర్పడడానికి ఈ వాతావరణం అనుకూలంగా ఉంటుందని అంటున్నారు.
వాస్తవానికి ఇది మయన్మార్ వైపు కదిలేట్టు కనిపించిందని, కానీ.. కొన్ని గంటలపాటు స్థిరంగా ఉన్న అల్పపీడనం.. క్రమ క్రమంగా భారత్ వైపు కదలడం మొదలు పెట్టిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కదలిక వేగంగా ఉందని, సముద్ర వాతావరణం వేడెక్కడం కూడా ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ నెల 24వ తేదీలోగా తీరాన్ని దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
కాగా.. నిన్నటి వరకు తౌక్తే తుఫాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించిన ఈ తుఫాను కారణంగా.. ఈ ఐదు రాష్ట్రాల్లో జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రాణనష్టంతోపాటు పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించిందని ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో తుఫాను ఏర్పడనుందన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది.