Chandrababu Govt: అధికారంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి ఎన్నికల్లో విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. దారుణమైన ఓటమికి కారణం అవుతాయి. ఇందులో ఏపీలో తెలుగుదేశం( Telugu Desam), వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అతీతం కాదు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం అమరావతి రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాల భూమిని సేకరించింది. కానీ రైతులకు న్యాయం జరగడంలో ఆలస్యం అయ్యింది. భూములు ఇచ్చిన రైతులకు నివాస, వాణిజ్య స్థలాలు ఇవ్వడంలో జాప్యం జరిగింది. రాజధాని నిర్మాణ హడావిడిలో ఉండిపోయిన అప్పటి టిడిపి ప్రభుత్వం వాటిని విస్మరించింది. అమరావతి రైతుల్లో అది వ్యతిరేకతకు కారణం అయింది. దాని ఫలితాలే 2019లో వచ్చాయి. రాజధాని లాంటి ప్రాంతంలో మంత్రిగా ఉన్న లోకేష్ సైతం ఓడిపోయే పరిస్థితి వచ్చింది.
జగన్ పట్టించుకోలే..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అమరావతి రైతులకు న్యాయం చేసి ఉంటే వారు జగన్మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకునేవారు. రాజకీయ కోణంలో ఆలోచించి అమరావతి క్రెడిట్ చంద్రబాబుకు దక్కకూడదని జగన్ భావించారు. మూడు రాజధానులను తెరపైకి తెచ్చి అమరావతిని నిర్వీర్యం చేశారు. ఆపై కమ్మరావతి, స్మశానం అంటూ ఎగతాళి చేశారు. అమరావతి రైతుల పోరాటాన్ని కూడా చిన్న బుచ్చుకునేలా చేశారు. ఎంతలా అవమానించారు అంతలా అవమానించారు. చివరకు వారు చంద్రబాబు న్యాయం చేస్తారని భావించి 2024 ఎన్నికల్లో కూటమికి ఏకపక్షంగా మద్దతు తెలిపారు. చంద్రబాబు సర్కార్ పై చాలా నమ్మకం పెట్టుకున్నారు.
ప్రజలు కోరుకున్నది అదే..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) తన ఆలోచనను అమలు చేశారు. కానీ ప్రజలు కోరుకున్న విధంగా చేయలేకపోయారు. ఎంతవరకు సంక్షేమ పథకాలు ఇచ్చాం కదా ఎందుకు ఓటు వేయరని భావించారు. ఎప్పుడూ చార్జీలు, పన్నులతో పిప్పి చేసే ప్రభుత్వం ఉచితంగా డబ్బులు ఇచ్చేసరికి ఐదేళ్లపాటు నిర్మొహమాటంగా తీసేసుకున్నారు ప్రజలు. అయితే ప్రజలు మాత్రం సంక్షేమ పథకాలను మాత్రమే కోరుకోలేదు. అభివృద్ధి, పరిశ్రమలు, రాజధాని ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఆశించారు. అవి దక్కకపోయేసరికి జగన్మోహన్ రెడ్డిని దించేశారు. అమరావతి రాజధానితోపాటు అభివృద్ధిని చంద్రబాబు మాత్రమే చేయగలరని భావించి ఏకపక్ష మద్దతుతో టిడిపి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు.
వైసీపీలో ధీమా
అయితే చంద్రబాబు( Chandrababu) చేస్తున్న తప్పులతో మళ్ళీ అధికారంలోకి వస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రప్పా రప్పా హెచ్చరికలు పంపుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో పాటు ఇతరత్రా నిర్మాణాల కోసం మరో 30 వేల ఎకరాల భూమిని సేకరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే తొలి విడత భూ సేకరణకు సంబంధించిన రైతులకి ఇంతవరకు న్యాయం జరగలేదు. అటువంటిది ఇప్పుడు మరోసారి భూసేకరణ అంటే రైతులు వ్యతిరేకిస్తున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు బాగానే ఉంటాయి. కానీ దాని మూల్యం ఎన్నికల్లో చూపుతుంది. ఈ విషయంలో చంద్రబాబు గుణపాఠాలు నేర్చుకోకపోవడం ఏమిటనేది ప్రశ్న.