Actor Suman Politics: దక్షిణాది రాష్ట్రాల్లో( South States) ఒక వెలుగు వెలిగారు యాక్టర్ సుమన్. సుమారు 700 చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. హీరోగా అనేక హిట్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. అయితే సుమన్ రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. ఆయన కూడా ఎప్పటికప్పుడు రాజకీయ ప్రకటనలు చేస్తూ వచ్చారు. గానీ పూర్తిస్థాయిగా రాజకీయాల్లోకి రాలేదు. తాజాగా ఆయన ఒక ప్రకటన చేశారు. తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తనకు అక్కడ పార్టీల నుంచి ఆహ్వానం అందుతున్నట్లు తెలిపారు. కానీ ఏపీకి 2029 లో ఎన్నికలు జరగనున్నందున.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తద్వారా ఏపీ నుంచి రాజకీయాల్లోకి వస్తానని సంకేతాలు ఇచ్చారు. అయితే సుమన్ ఇటువంటి ప్రకటనలు చేయడం ఇది కొత్త కాదు.
Also Read: ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?
* కర్ణాటక స్వస్థలం..
సుమన్( actor Suman) పుట్టి పెరిగింది చెన్నై. కానీ ఆయన కర్ణాటకలో జన్మించారు. ఆయన స్వస్థలం మంగుళూరు. మాతృభాష తుళు. తల్లిదండ్రులు వృత్తిరీత్యా చెన్నై వచ్చారు. సుమన్ విద్యాధికుడు. బహుభాషల్లో ఆయన మాట్లాడేవారు. తుళు, ఇంగ్లీష్,తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలో అనర్గళంగా మాట్లాడేవారు. 1977లో ఓ తమిళ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. అలా తెలుగు సినిమాల్లో కూడా నటించారు. స్వతహాగా కరాటే మాస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుమన్ యాక్షన్ సినిమా హీరోగా పేరు తెచ్చుకున్నారు.
* టిడిపి తో సన్నిహిత సంబంధాలు..
అయితే ఆది నుంచి సుమన్ తెలుగుదేశం( Telugu Desam) పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ఆ పార్టీ తరఫున ప్రచారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏపీకి చెందిన అల్లుడు కావడంతో రేపల్లె అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సుముఖత వ్యక్తం చేసింది. కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు సుమన్. తరువాత బిజెపిలో చేరారు. ఆ పార్టీలో కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. అయితే సుమన్ చేస్తున్న రాజకీయ ప్రకటనలు ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి. ఎవరు అధికారంలో ఉంటే వారిని ప్రశంసిస్తుంటారు. గతంలో జగన్ ను ప్రశంసించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అంతా భావించారు. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వాన్ని పొగుడుతున్నారు. చంద్రబాబు సమర్థ నాయకత్వంతో ఏపీ అభివృద్ధి సాధిస్తుందని చెబుతున్నారు. దీంతో ఇలా భిన్న ప్రకటనలు చేయడంతో అన్ని రాజకీయ పార్టీలకు సుమన్ దూరమవుతున్నారు. పైగా ఎన్నికల నాటికి ఒక నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు కూడా. ఎందుకంటే ఇప్పటి తరానికి సుమన్ తెలియదు. పైగా టిక్కెట్లు ఇచ్చే సమయానికి పార్టీలో చేరితే ఆయనకు అవకాశం ఉండే ఛాన్స్ ఉండదు. మరి ఇంకా తేల్చుకోవాల్సింది సుమనే..