Duvvada Srinivas Rao : అచ్చెన్న చేతిలో కాదు… భార్య చేతిలో ఓడిన దువ్వాడ

చివరికి ఈ గోల ఎందుకని..దువ్వాడ వాణినే అభ్యర్థిగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.  మొత్తానికైతే టెక్కలిలో అచ్చెన్నాయుడు నామినేషన్ వేయలేడని బీరాలు పలికిన దువ్వాడ.. ఇప్పుడు తాను నామినేషన్ వేయకుండా పూజకు పనికారాని పుష్పంలా మారారని సెటైర్లు వినిపిస్తున్నాయి.

Written By: Dharma, Updated On : May 27, 2023 6:37 pm
Follow us on

Duvvada Srinivas Rao : రాష్ట్రంలో టీడీపీ నేతలపై నోరుపారేసుకునే నేతలంటే సీఎం జగన్ కు మహా ఇష్టం. అటువంటి వారిని గుర్తించి మరీ అందలమెక్కించుకుంటారు. ఇలా జగన్ ప్రోత్సాహంతో రాత్రికి రాత్రే నాయకులైన వారు ఉన్నారు. అటువంటి నేతల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. శ్రీకాకుళం జిల్లాలో దూకుడు గల నేతగా దువ్వాడకు పేరుంది. అందుకే ఆయన్ను అచ్చెన్నాయుడిపై జగన్ ఎగదోశారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కలబడు అంటూ ఆదేశించారు. దీంతో అయినదానికి కానిదానికి శీను తెగ కలబడిపోయేవాడు. అచ్చెన్నాయుడుపై బూతులతో విరుచుపడిపోయేవాడు. ఒకానొక దశలో టెక్కలిలో అచ్చెన్నాయుడు నామినేషన్ కూడా వేయలేడని తేల్చిచెప్పాడు. ఇప్పుడు అదే దువ్వాడ శ్రీనివాస్ తాను నామినేషన్ వేయను.. నా భార్య వాణి నామినేషన్ వేస్తుందని చెప్పి మౌనమునిగా మారిపోయారు.

సీఎం జగన్ మాటలకు తిరుగులేదంటారు. అటువంటి సీఎం టెక్కలి నియోజకవర్గానికి వచ్చి మన అభ్యర్థి అంటూ దువ్వాడ శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు, ప్రజలకు పరిచయం చేశారు. ఆయన మాకొద్దంటూ నాలుగు మండలాల కేడర్ విన్నవించినా.. కాదు కాదు శీనేనంటూ తేల్చిచెప్పారు. మొన్నటికి మొన్న మూలపొలం పోర్టు శంకుస్థాపనకు వచ్చి అదే చెప్పారు. కానీ  ఇవాళ సీన్ మారిపోయింది. స్వయంగా దువ్వాడ శ్రీనివాసే ప్రెస్ మీట్ పెట్టి ..తాను కాదు తన భార్య పోటీ చేస్తున్నారని ప్రకటించాల్సి వచ్చింది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ ను చూసి జిల్లా మొత్తం నవ్వుకుంటున్నారు. ఇంత బతుకు బతికి ఇదేందయ్యా శీను అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు.

బూతులతో రెచ్చిపోయే దువ్వాడ శ్రీనివాస్ జగన్ మెప్పుపొందడంతో నాయకుడిగా మారిపోయారు. జిల్లాలో మిగతా కీలక నాయకులు వ్యతిరేకిస్తున్నా పట్టుపట్టి మరీ దువ్వాడకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఒకానొక దశలో మంత్రి పదవి ఆఫర్ చేశారిని ప్రచారం సాగింది. జిల్లాలో చాలా వరకూ చక్రం తిప్పారు. అయితే ఆయన ఓ మహిళ తో వివాహేతర బంధంలో చిక్కుకున్నారు. ఆ మహిళ చెప్పినట్లే జిల్లాలో అధికారుల పోస్టింగ్‌లు..ఇతర పనులు చేస్తున్నారు. ఈ వ్యవహారం ఆయన కుటుంబంలో చిచ్చు పెట్టింది. దువ్వాడ వివాహేతర బంధం సాక్ష్యాలతో సహా ఆయన భార్య దువ్వాడ వాణి దగ్గరకు చేరడంతో కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం వాణి జడ్పీటీసీగా ఉన్నారు. దువ్వాడ ఎమ్మెల్సీ కాకుంటే ఆమె జడ్పీ చైర్ పర్సన్ అయి ఉండేవారు. కానీ భర్త కోసం ఆమె త్యాగం చేశారు. అయితే భర్త దువ్వాడ శ్రీనివాస్ నైజం తెలుసుకున్న ఆమె వైసీపీ హైకమాండ్ దగ్గరకు వెళ్లి ఎమ్మెల్యే టిక్కెట్ తనకే ఇవ్వాలని పట్టుబట్టారు. లేకపోతే మీడియా ముందు తన భర్త బాగోతాన్ని బయట పెడతానని హెచ్చరించారు. ఈ విషయం గోల గోల కావడంతో హైకమాండ్ రాజీ చేసే ప్రయత్నం చేసింది. కొన్నాళ్ల కిందట ఇద్దరూ ప్రెస్ మీట్ పెట్టి.. మా మధ్య గొడవల్లేవని చెప్పుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా దువ్వాడ శ్రీను మారకపోవడంతో.. ఆమె ఫైనల్ అల్టిమేటం ఇచ్చారు. చివరికి ఈ గోల ఎందుకని..దువ్వాడ వాణినే అభ్యర్థిగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.  మొత్తానికైతే టెక్కలిలో అచ్చెన్నాయుడు నామినేషన్ వేయలేడని బీరాలు పలికిన దువ్వాడ.. ఇప్పుడు తాను నామినేషన్ వేయకుండా పూజకు పనికారాని పుష్పంలా మారారని సెటైర్లు వినిపిస్తున్నాయి.