Home Guard Srinivasa Rao: ఇప్పటివరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు చేసిన తనిఖీలలో ఉన్నత హోదాలలో పనిచేసిన ఉద్యోగులు మాత్రమే దొరికారు. వారు మాత్రమే ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే అభియోగాలు ఎదుర్కొన్నారు. కానీ చరిత్రలో తొలిసారిగా ఓ హోంగార్డ్ అదాయానికి మించి కాదు.. అంతకుమించి అనే స్థాయిలో ఆస్తులను సంపాదించాడు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు రావడంతో సదరు హోంగార్డు మీద దృష్టి పెట్టారు. ఆ తర్వాత ఆయన బాగోతం కథలు కథలుగా బయటపడింది.
అతడి పేరు శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా పని చేస్తూ ఉంటాడు. అతడు గతంలో ఏసీబీ శాఖలో దాదాపు 15 సంవత్సరాలుగా పనిచేశాడు. అతను పని చేస్తున్న క్రమంలో ముందుగా దాడుల గురించి సమాచారాన్ని సంబంధిత అధికారులకు చేరవేసేవాడు. తద్వారా వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. ఉన్నతాధికారుల అండతో.. వారికి రకరకాల సపర్యలు చేసి 15 సంవత్సరాల పాటు ఏసీబీలో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాడు. 15 సంవత్సరాలు కాలంలో అతడు దాదాపుగా 20 కోట్ల వరకు ఆస్తులను కూడ పెట్టాడు.
తన మీద ఏమాత్రం అనుమానం రాకుండా ఉండడానికి అత్యంత జాగ్రత్తగా వ్యవహరించేవాడు. డబ్బులు కూడా నేరుగా తీసుకునేవాడు కాదు. అయితే ఇటీవల కాలంలో అతని ఆస్తులు అంతకంతకు పెరగడం.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతడి గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు రావడంతో శ్రీనివాసరావు మీద దృష్టి పెట్టారు. అతడి ఆస్తులు.. వాడుతున్న ఫోన్లు.. ఖరీదైన లైఫ్ స్టైల్ చూసి ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అన్ని వివరాలు సేకరించి గురువారం అతని ఇంట్లో సోదాలు మొదలుపెట్టారు.
ఏసీబీ అధికారులు విజయనగరం, గుర్ల, విశాఖపట్నంలో తనిఖీలు నిర్వహించారు. దాదాపు 20 కోట్ల ఆస్తులను గుర్తించారు. ఖరీదైన ఇళ్ల స్థలాలు.. గృహాలు.. బంగారం, నగదు, వ్యవసాయ భూములు అతడు సంపాదించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఇతడు సంపాదించిన ఆస్తులు మొత్తం కుటుంబ సభ్యులు, బంధువుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే ఇటీవల కాలంలో అతడు ఖరీదైన వాహనాలలో తిరగడం పోలీసు ఉన్నతాధికారుల కంటపడింది. ఆ తర్వాత అతని గురించి వరుసగా ఫిర్యాదులు రావడంతో లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. అనంతరం అతడు సంపాదించిన సంపాదన.. చేస్తున్న లాబింగ్ వ్యవహారాలు మొత్తం పోలీసులకు తెలిసిపోయాయి. దీంతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేయడంతో శ్రీనివాసరావు బండారం మొత్తం బయటపడింది.