ABN Venkata Krishna On Jagan: జర్నలిస్టులు న్యూట్రాలిటీని పోగొట్టుకుంటే పాత్రికేయం సిగ్గుమాలిన వ్యవహారం అలాగే ఉంటుందని.. వెనకటికి ఓ దిగ్గజ పాత్రికేయుడు సెలవిచ్చారు. ఇప్పుడు తెలుగు నాట చూస్తున్న పరిస్థితులను పరిశీలిస్తుంటే అది నిజమనిపిస్తుంది. పాత్రికేయం ఒక వర్గానికి, ఒక పార్టీకి డప్పు కొట్టడం ప్రారంభమైన తర్వాత.. వాస్తవం కాలగర్భంలో కలిసిపోతుంది. ప్రజలకు నిజం తెలిసే అవకాశం దూరమవుతుంది.
నిజం దూరమైన తర్వాత ఆ సమాజం ఏ రీతిలోనూ బాగుపడదు. అబద్ధం అనేది ప్రతి రంగంలోనూ.. ప్రతి వ్యవస్థలోనూ ప్రవేశిస్తుంది కాబట్టి లోప భూయిష్టమే దర్శనమిస్తుంది. అలాంటి వ్యక్తులు ఉన్న సమాజం బాగుపడే అవకాశం లేదు. బాగుపడటానికి మార్గం కూడా ఉండదు. తెలుగు నాట పాత్రికేయం అనేది భజనపర్వంగా.. భజన మండలిగా మారిపోయింది. అధికార పార్టీకి ఒక వర్గం.. ప్రతిపక్ష పార్టీకి ఒక వర్గం అంటూ మీడియా విడిపోయింది. ఉదయం లేస్తే ఒకరిని ఒకరు తిట్టుకోవడంతోనే సరిపోతుంది. టన్నులకొద్దీ బురద చల్లుకోవడంతోనే ముగుస్తోంది. వాస్తవానికి పాత్రికేయమనేది ప్రజల సమస్యలను గుర్తించి వార్తలను ప్రచురించాలి. ప్రసారం చేయగలగాలి. దానిని వాస్తవ ప్రాతిపదిక పాత్రికేయమని పిలుస్తుంటారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి వస్తుందని ఆశ కూడా లేదు.
Also Read: Jagan Mohan Reddy : జగన్ అరెస్ట్ అయితే వైసిపి బాధ్యతలు ఎవరికి?
ఇక తెలుగు నాట ఈ దరిద్రం మరింత పెరిగిపోయింది. ఇష్టానుసారంగా పాత్రికేయులు రాజకీయ నాయకుల కంటే మించి వ్యాఖ్యలు చేయడం ఇటీవల పెరిగిపోయింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం పల్నాడులో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ తన పార్టీ కార్యకర్త విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇదే క్రమంలో తన స్వగృహం నుంచి పల్నాడు బయలుదేరి వెళ్లిపోయారు. 84 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి ఆయన దాదాపు 10 గంటల సమయం తీసుకున్నారు. ఒక రకంగా ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు జనాలు రావడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వం అనేక రకాల షరతులు విధించినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు. ఒక యాంగిల్ లో ఇది వైసిపి అనుకూల మీడియాకు గొప్పగానే అనిపించవచ్చు. కానీ కూటమి అనుకూల మీడియాకి ఇది ఏమాత్రం నచ్చదు. నచ్చే అవకాశం లేదు. అందువల్లే ఏబీఎన్ లో నిన్న మొత్తం జగన్ వ్యతిరేక కథనాలు ప్రసారమయ్యాయి. జగన్ పర్యటనలో చోటు చేసుకున్న అపశృతులు హైలెట్ అయ్యాయి. ఏబీఎన్ లో పనిచేసే వెంకటకృష్ణ వైసిపి అధినేత టూర్ లో చోటు చేసుకున్న అపశృతులను ప్రధానంగా ప్రశ్నించారు. ఇంత కాన్వాయ్ ఎందుకు? ఈ స్థాయిలో హంగు ఆర్భాటం ఎందుకు? ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది కదా.. దానిని అనుసరించి నడుచుకోవచ్చు కదా అంటూ వెంకటకృష్ణ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకరకంగా తన ఆగ్రహాన్ని, మేనేజ్మెంట్ ఆగ్రహాన్ని.. ప్రజల ఇబ్బంది రూపంలో వెంకటకృష్ణ చెప్పారు. ఇది కూటమి అనుకూల నాయకులకు సానుకూలంగా ఉండవచ్చు గాని.. వైసిపి అనుకూల కార్యకర్తలకు ఏమాత్రం నచ్చడం లేదు. అందువల్లే సోషల్ మీడియాలో వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి క్రేజ్ చూసి వెంకటకృష్ణ పొగిడాడు అని వైసీపీ నేతలు అంటుంటే.. తిట్టాడని కూటమినేతలు అంటున్నారు. మొత్తంగా ఎవరికి తగ్గట్టుగా వారు వ్యాఖ్యానాలు చేసుకుంటున్నారు.