ABN RK Kothapaluku : ఉదయాన్నే ఆంధ్రజ్యోతి చూడగానే.. ఏపీ మంత్రి గారి మంత్రాంగం.. అనే శీర్షికతో బొంబాట్ వార్త కథనం కనిపించింది.. ఈ మధ్య ఆంధ్రజ్యోతి కూటమి ప్రభుత్వానికి డప్పు కొడుతూనే.. అవసరం వచ్చినప్పుడు అల్లా ఇదిగో ఇలాంటి కథనాలను ప్రచురిస్తోంది. అయితే అందరి మంత్రులు విషయంలో ఇలాగే ఉంటుందా.. తనకు గిట్టని వాళ్లపైనే ఇలా రాస్తుందా? అనే ప్రశ్నను కాస్త పక్కన పెడితే.. ఇలాంటి కథనాలే జనాలకు ఆసక్తి కలిగిస్తాయి. పత్రికకు ఎంత కొంత రీడబులిటీని పెంచుతాయి.
కూటమి ప్రభుత్వం మంత్రులకు సంబంధించి లేదా ప్రజా ప్రతినిధుల తెరవెనక సంపాదన గురించి ఆధారాలతో రాయడం సాక్షికి చేతకావడం లేదు.. సాక్షికి భారీగా సాధన సంపత్తి ఉన్నా… అది ఎన్నడూ జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడింది లేదు. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనే సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.. ఎందుకంటే గత ఆరు నెలల కాలంలో సాక్షి ఒక్కటంటే ఒక్కటి ఆధారాలతో కూడిన కథనాన్ని ప్రసారం చేయలేదు. ప్రచురించనూ లేదు.. ఇక్కడేదో ఆంధ్రజ్యోతి సుద్దపూస అని కాదు.. అదేం సర్వ పరిత్యాగి అని చెప్పడం లేదు.. కాకపోతే ఇలాంటి సందర్భాల్లోనే సాక్షి కాస్త ఎక్కువ పని చేయాలి. ఇంకాస్త లోతుల్లోకి వెళ్లాలి. ప్రభుత్వానికి సంబంధించి.. జరుగుతున్న ప్రతి పరిణామాన్ని పరిశీలించాలి. కానీ అదే విషయాన్ని సాక్షి దూరం పెట్టింది. ఎప్పట్లాగానే రుచి పచీ లేని కథనాలను ప్రచురిస్తోంది.. పైగా అదే రొటీన్ లేఔట్ తో చదివే వాళ్లకు విసుగు తెప్పిస్తోంది.
ఎవరా డార్లింగ్ మంత్రి
ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనంలో డార్లింగ్ మంత్రి అని ప్రస్తావించింది. ఆయన సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచి కళాపోషకుడుట.. ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మళ్లీ గెలవడంతో చంద్రబాబు నాయుడు పదవి ఇచ్చారట. దీంతో ఆయన వారంలో మూడు రోజులు హైదరాబాదులో.. రెండు రోజులు హోటల్లో.. మిగతా రెండు రోజులు విజయవాడలో ఉంటున్నారట. హైదరాబాదులో ఓ స్టార్ హోటల్లో బస చేస్తున్నారట. ఆయన వస్తే చాలు గానా బజానా మొదలవుతుందట. పైగా ఆ మంత్రి ఇటీవల తెలంగాణ వ్యవహారాల్లో వేలు పెట్టారట. దీనిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించి.. “ఏమోయ్ చంద్రబాబూ.. చూస్తున్నావా మీ మంత్రిగారి లీలలు.. మా తెలంగాణలో భూ వివాదాలలో వేలు పెడుతున్నాడు. ఇప్పటికే చాలా చూశాం. ఇకపై ఉపేక్షించేది లేదు.. గట్టి చర్యలు తీసుకుంటామని” లేఖ రాసిందట. ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రస్తావించింది. ఐదేళ్లపాటు జగన్ గట్టిగా దెబ్బలు కొట్టినప్పటికీ.. చంద్రబాబు తట్టుకున్నాడు.. పవన్ కళ్యాణ్ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాడు. మళ్లీ ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటే.. జగన్ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏముందనేది ఆంధ్రజ్యోతి వాదన.. ఈ కోణంలో మాత్రం ఆంధ్రజ్యోతిని అభినందించాల్సిందే.. చూడాలి మరి ఆ డార్లింగ్ మంత్రిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. ఆమధ్య సత్యవేడు.. గుంటూరు ఎమ్మెల్యేల వ్యవహార శైలితో కూటమి ప్రభుత్వానికి తల బొప్పి కట్టింది. ఇప్పుడు డార్లింగ్ మంత్రి తో తలవంపులు మొదలయ్యాయి.. మరి ఈ పరిణామాలను చంద్రబాబు ఎలా కట్టడి చేస్తారో చూడాల్సి ఉంది.