Chandrababu – ABN RK : చంద్రబాబుకి ఏబీఎన్ ఎండి రాధాకృష్ణ మరో గిఫ్ట్
అమిత్ షాతో సమావేశం అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మేలు కలిగించే విదమైన నిర్ణయం బిజెపి తీసుకునేలా చేయడం ద్వారా చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
Chandrababu – ABN RK : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కోసం అనునిత్యం తపించే వ్యక్తుల్లో ముందు వరుసలో ఉంటారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ. తెలుగుదేశం పార్టీ గురించి రాధాకృష్ణ ఆలోచించేలా చంద్రబాబు కూడా ఆలోచించరేమో అన్న భావన ఆ పార్టీ నాయకుల్లోనూ వ్యక్తమవుతుంటుంది. తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం గత నాలుగేళ్లుగా తన వంతు ప్రయత్నాలను ఆయన చేస్తున్నారు. చంద్రబాబుకు మేలు చేకూర్చే మరో గొప్ప అవకాశం ఏబీఎన్ ఎండి రాధాకృష్ణకు లభించింది. తెలంగాణ పర్యటనకు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు రంగాలకు చెందిన ప్రముఖులను కలవబోతున్నారు. వీరిలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కూడా ఉన్నారు. ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని కలిగిస్తున్న అంశంగా మారింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్, ఆంధ్రజ్యోతి పత్రికను నిర్వహిస్తున్నారు ఆ సంస్థ అధినేత వేమూరి రాధాకృష్ణ. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ రాజకీయ నాయకులకు ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో.. ఇంచుమించుగా అంతే స్థాయిలో ఆయనకు పేరు ఉంది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కోసం, ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం అనునిత్యం ఆయన శ్రమిస్తుంటారు అన్న ప్రచారం ఉంది. వైసీపీకి చెందిన సామాజిక మాధ్యమాల్లో, పార్టీ నాయకులు అయితే ఆయన గురించి పెద్ద ఎత్తున విమర్శలను గుప్పిస్తూ ప్రచారం చేస్తుంటారు. రాధాకృష్ణకు ఏమాత్రం వీలు చిక్కినా చంద్రబాబుకు మేలు చేసేందుకు ఆయన వెనక్కి తగ్గరు. అటువంటి రాధాకృష్ణను కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం కలవబోతున్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బిజెపిపై నిరంతరం విమర్శనాస్త్రాలు సంధించే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ అమిత్ షా కలుస్తుండడం, తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తెలంగాణ పర్యటనకు వస్తూ కీలక నేతలతో సమావేశం..
గడిచిన తొమ్మిదేళ్లుగా భారతీయ జనతా పార్టీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి సంస్థలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రధాన నరేంద్ర మోడీ లక్ష్యంగా అనేక విమర్శలను ఈ ఛానల్, పత్రిక ద్వారా చేశారు. అటువంటి సంస్థ అధినేతను అమిత్ షా కలుస్తుండడం కాస్త చర్చనీయాంశంగా మారింది. తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు భారతీయ జనతా పార్టీని దొంగగా చూపించేందుకు ఏనాడు వెనక్కి తగ్గలేదు ఆర్కే. తమ శత్రువు అయినప్పటికీ వెళ్లి కలుస్తున్నాము అన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతోనే అమిత్ షా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణను కలుస్తున్నారు. ఇది అమిత్ షా ప్రణాళికగా చాలా మంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, దీనిని కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం రాధాకృష్ణ చేయవచ్చని పలువురు చెబుతున్నారు.
ఇదే అదునుగా ఫిర్యాదులు చెప్పే అవకాశం..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనను నేరుగా కలిసేందుకు వస్తుండడంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు గొప్ప అవకాశం దక్కినట్లు అయింది. ఇప్పటి వరకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై పత్రిక, ఛానల్ ద్వారా కథనాలు వండి వారిస్తూ కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, ఇప్పుడు నేరుగా అమిత్ షా తన వద్దకు వస్తుండడంతో అనేక విషయాలను షా దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డికి డబ్బులు ఇవ్వద్దని, జగన్ ను ఏదో ఒకటి చేసేయాలని, అప్పులు ఇవ్వవద్దని, కేంద్రం నుంచి సహకారాన్ని అందించవద్దని, పనిలో పనిగా చంద్రబాబును దగ్గరకు తీసుకోవాలని కూడా అమిత్ షాకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ సూచించే అవకాశం కనిపిస్తోంది. అలాగే, రాష్ట్రంలో బిజెపి నేతలైన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావుపై ఫిర్యాదులు చేసే అవకాశం కనిపిస్తోంది.
ఆ రాతలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..
కొద్దిరోజుల కిందట అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. రేపు రాధాకృష్ణతో సమావేశం కానున్నారు. ఈ రెండింటిని ఏకతాటిపైకి తీసుకువచ్చి రాధాకృష్ణ ద్వారా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బిజెపి ప్రయత్నిస్తోందన్న కథనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు, పలువురు రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. దీనిపై రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో చూడాలి. అమిత్ షాతో సమావేశం అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మేలు కలిగించే విదమైన నిర్ణయం బిజెపి తీసుకునేలా చేయడం ద్వారా చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.