AP Aarogyasri Services: ఏపీలో( Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పేరుకుపోయిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సేవలు నిలిపివేసాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి సేవలు నిలిచిపోవడంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పేలా లేదు. కూటమి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పై ప్రజల్లో ఒక రకమైన సానుకూలత ఏర్పడిన క్రమంలో.. ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత మాత్రం ఇబ్బందికర పరిణామంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపు 2500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సొమ్ము చెల్లిస్తే తప్ప తిరిగి వైద్య సేవలు ప్రారంభించేది లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఏకకాలంలో అంత మొత్తం సమకూర్చడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరమే.
* పేరుకుపోయిన బకాయిలు..
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వంలోనే బకాయిలు భారీగా పేరుకుపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లింపులు ప్రారంభం అయ్యాయి. కానీ ఒకవైపు చెల్లింపులు చేస్తూ వచ్చిన బకాయిలు మాత్రం పెరుగుతూ వచ్చాయి. దీంతో పలుమార్లు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని చెబుతూ వచ్చాయి. కానీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చల ద్వారా సేవల నిలిపివేత లేకుండా చేశాయి. కానీ ఇప్పుడు భారీ మొత్తంలో.. 2500 కోట్ల రూపాయలు పేరుకుపోవడంతో ప్రభుత్వానికి కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇప్పటికే ప్రధాన సంక్షేమ పథకాలన్నీ ప్రారంభం అయ్యాయి. వారికి భారీ మొత్తంలో కేటాయింపులు జరిగాయి. ఈ సమయంలో రూ.2500 కోట్లు చెల్లించాలంటే ప్రభుత్వానికి కత్తి మీద సామే.
* బీమా పథకం కిందకు..
అయితే కూటమి ప్రభుత్వం( Alliance government ) ఇటీవల ఒక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్ తో పాటు ఆరోగ్యశ్రీని అనుసంధానం చేస్తూ.. ఒక బీమా పథకాన్ని తెరపైకి తెచ్చింది. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వైద్య సేవలను వర్తింపజేస్తూ బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కేవలం బీమా మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. తద్వారా ప్రభుత్వం పై ఆర్థిక భారం తగ్గుతుంది. ఎవరికైనా వైద్య చికిత్సకు నగదు చెల్లించాలనుకుంటే సదరు బీమా కంపెనీ క్లైమ్ కింద అందిస్తుంది. పైగా గంటల వ్యవధిలోనే వైద్య చికిత్సలకు అనుమతి రానుంది. అయితే క్యాబినెట్లో మాత్రమే ఈ కొత్త ఇన్సూరెన్స్ పథకంపై ఒక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలో దీనిని అమలు చేసేందుకు సిద్ధపడుతోంది. అయితే అంతకంటే ముందే ఆరోగ్యశ్రీ కి కొంత మొత్తం బకాయిలు చెల్లించి.. వైద్య సేవలు పునరుద్ధరించాలని చూస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.