Aadudam Andhra scam: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త పోరాటాలకు సిద్ధం అవుతోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని తప్పుపడుతూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి రెడీ అవుతోంది. ఈ విషయంలో ఇతర రాజకీయ పక్షాల సహకారం తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు తమతో కలిసి రావాలని కోరారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు జరిగిందని వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడే పునాదుల స్థాయిలో ఉన్న భవనాలను చూపించి.. ఇదేనా మెడికల్ కాలేజీలు అంటూ టిడిపి ప్రశ్నిస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం నేతలు పెద్దగా మాట్లాడడం లేదు. ఒకరిద్దరు తప్పిస్తే గట్టిగా రిప్లై ఇవ్వలేకపోతున్నారు. దీనిపై విమర్శలు రావడంతో అధినేత జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి రోజా ఈ అంశంపై మాట్లాడడం విశేషం.
‘ఆడుదాం ఆంధ్రా’ లో అవినీతి
గత కొద్దిరోజులుగా రోజా( RK Roja ) కనిపించడం లేదు. ఆమె అరెస్టు ఉంటుందని అంతటా ప్రచారం జరిగింది. వైసిపి హయాంలో ఆమె క్రీడల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్రా పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో భారీ అవినీతి జరిగిందన్నది కూటమి ప్రభుత్వ ఆరోపణ. దీనిపై విజిలెన్స్ విచారణ కూడా ప్రారంభం అయింది. పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టాయని విజిలెన్స్ విచారణలో తేలింది. ఈ క్రమంలో అప్పటి మంత్రిగా వ్యవహరించిన రోజాతో పాటు శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి సైతం ఈ కుంభకోణంలో హస్తం ఉందని విజిలెన్స్ విచారణలో తేలినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లో ఖచ్చితంగా మాజీ మంత్రి రోజా అరెస్టు జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పటినుంచి రోజా సైతం వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో ఏకంగా హోంమంత్రి వంగలపూడి అనిత పై విరుచుకుపడ్డారు రోజా. తద్వారా తన అరెస్టు విషయంలో భయపడడం లేదని తెలుస్తోంది. తనను అరెస్టు చేస్తే సానుభూతి వర్కౌట్ అవుతుందని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. అందుకే గట్టి వాయిస్ తోనే రోజా ఇప్పుడు ముందుకు వచ్చారు.
ఏకంగా హోం మంత్రికి సవాల్..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) క్యాబినెట్లో మంత్రిగా వ్యవహరించారు రోజా. ఆమె క్రీడల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 2024 డిసెంబర్లో ఆడుదాం ఆంధ్రా పేరిట క్రీడా పోటీలు నిర్వహించారు. అయితే అప్పట్లో ఆ క్రీడా పోటీలపై అనేక రకాల విమర్శలు వచ్చాయి. వాలంటీర్లే ఎంపైర్లుగా మారగా.. వైసీపీ సానుభూతిపరులతో క్రీడా పోటీలు నిర్వహించి పెద్ద ఎత్తున నిధులను పక్కదారి పట్టించారన్న విమర్శ ఉంది. నాసిరకం క్రీడా పరికరాలను అందించి భారీగా నిధులు గోల్మాల్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. అయితే దీనిపై అన్ని జిల్లాల నుంచి విజిలెన్స్ విచారణ జరిగింది. మాజీ మంత్రి రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అరెస్టు చేస్తారని టాక్ నడిచింది. అయితే కొన్ని రోజులపాటు రోజా సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా మీడియా ముందుకు వచ్చి ఏకంగా వంగలపూడి అనితకు సవాల్ చేశారు. మెడికల్ కాలేజీలపై అనిత తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తనతో వస్తే పాడేరు మెడికల్ కాలేజీని చూపిస్తానంటూ సవాల్ చేశారు. మొత్తానికి అయితే కూటమి కేసుల విషయంలో డోంట్ కేర్ అన్నట్టు రోజా వ్యవహార శైలి ఉంది. మరి కూటమి నుంచి ఎలాంటి రిప్లై ఉంటుందో చూడాలి.