YS Sharmila: పీసీసీ పగ్గాలు అందుకున్న వైఎస్ షర్మిల ను వైసీపీ శ్రేణులు టార్గెట్ చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన తర్వాత ఆమెపై వైసిపి శ్రేణుల అభిప్రాయం మారుతూ వచ్చింది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న తర్వాత షర్మిల వైసీపీని టార్గెట్ చేసుకున్నారు. సీఎం జగన్ తో పాటు వైసీపీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. దీంతో ఆమె వైసీపీ శ్రేణులకు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగానికి టార్గెట్ అయ్యారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె కాదంటూ.. ఆమె బ్రదర్ అనిల్ కుమార్ భార్య అంటూ వ్యాఖ్యానాలు కొనసాగాయి. అయితే దీనిపై స్పందించిన షర్మిల ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.
అయితే తాజాగా వివేకానంద రెడ్డి కుమార్తె సునీత హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. తమపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. చంపేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. అయితే దీనిపై వైసీపీ శ్రేణులు రివర్స్ అవుతున్నారు. ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సునీత, షర్మిలపై వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. వారిద్దరి వెనుక ఐటిడిపి శ్రేణులు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ అంశం యూ టర్న్ తీసుకుంది.
ఇటీవలే వివేకానంద రెడ్డి కుమార్తె సునీత షర్మిలను కలుసుకున్నారు. ఏకంగా కడపలోని ఇడుపాలపాయలో చర్చలు జరిపారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు వచ్చాయి. వివేకానంద రెడ్డి హత్య జరిగిన తరువాత వైయస్ కుటుంబంలో రేగిన చిచ్చు గురించి అందరికీ తెలిసిందే. వివేక హత్య కేసులో నిందితులందరికీ శిక్ష పడాలని సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. ఆమె షర్మిలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. అటు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని జగన్ వెనుకేసుకొస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో షర్మిల, సునీతలు రాజకీయంగా ఒక్కటైతే ఇబ్బందులు తప్పవని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే మొన్నటి వరకు గౌరవభావంతో చూసిన షర్మిలను వ్యతిరేకించడం ప్రారంభించారు. ఆమె వ్యక్తిగత జీవితాన్ని సైతం ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో సునీత తనతోపాటు సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. తమను చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను గమనించిన వైసీపీ నేతలు వారిద్దరి వెనుక ఐటీడీపీ హస్తముందని ఆరోపిస్తూ తిరిగి ఫిర్యాదులు చేస్తుండడం విశేషం. అయితే ఈ ట్విస్టులు ఎంతవరకు వెళ్తాయో చూడాలి.